తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ (satyavathi rathod) స్పందించారు. కేసీఆర్ వల్ల తన పదవికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భావించే తెలంగాణపై ప్రధాని మోడీ విషం చిమ్ముతున్నారని ఆమె మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నిరసనలకు సైతం పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ (satyavathi rathod) స్పందించారు. కేసీఆర్ వల్ల తన పదవికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భావించే తెలంగాణపై ప్రధాని మోడీ విషం చిమ్ముతున్నారని ఆమె మండిపడ్డారు. పార్లమెంట్ తలుపులు వేసి రాష్ట్రం ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. ఆ రోజు బీజేపీ నేతలు కళ్లు మూసుకుని మద్ధతిచ్చారా అని సత్యవతి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రధాని హైదరాబాద్‌కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని సత్యవతి రాథోడ్ ఎద్దేవా చేశారు. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని, కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు. మీ ఒక్కరికే రాజ్యాంగం తెలిసినట్లు, తెలివి ఉన్నట్లు మాట్లాడొద్దని సత్యవతి రాథోడ్ చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని వెళ్లగక్కే క్రమంలో తెలంగాణ ప్రజలపై అక్కసు వెళ్ళబుచ్చడం సరైన పద్దతి కాదని ... మూర్ఖ వ్యక్తి ప్రధాని కావడం దేశ ప్రజల దురదృష్టమని సత్యవతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) కూడా మోడీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) , తెలంగాణను (telangana) మళ్లీ కలిపేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించ పరిచేలా ప్రధాని మోదీ పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని విమర్శించారు.
గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్దిలో ముందుకెళ్తే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని తలసాని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు.. తెలంగాణపై మోదీ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేవరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి తలసాని పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతుందని.. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఓడిపోతామని తెలిసి బీజేపీ నేతలు కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సింగరేణి జోలికొస్తే తెలంగాణ భగ్గు మంటుందని హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
