ఓబులాపురం మైనింగ్ కేసులో తన డిశ్చార్జి పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిమీద సీబీఐ వాదనలు వినిపించింది. 

హైదరాబాద్ : ఓఎంసీ కి లబ్ధి చేకూరేలా ఓబులాపురం మైనింగ్ లీజుల మంజూరు కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారని సిబిఐ శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. ఫైల్ మీద తాను కేవలం సంతకం మాత్రమే పెట్టానని.. ఫైల్ ను అధికారులే రూపొందించారని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోలేరని తెలిపింది. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు కిందిస్థాయి అధికారులు చెప్పినట్లు నడుచుకోవడం సరికాదని.. రాజ్యాంగం ప్రకారం తన విధులు నిర్వర్తించాలని సిపిఐ పేర్కొంది. ఓబులాపురం మైనింగ్ కేసులో 9వ నిండితురాలిగా ఉన్న ప్రస్తుత విద్యా శాఖ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన డిశ్చార్జి పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్ దీనిమీద విచారణ చేశారు. ఈ మేరకు సిబిఐ తెరకు ప్రత్యేక న్యాయవాది ఏం నాగేంద్రన్ వాదనలు వినిపించారు. పాత డాక్యుమెంట్ లతో మూడో అనుబంధం అభియోగ పత్రం దాఖలు చేశారని పిటీషనర్ వాదించారు. ఈ వాదనలను ఆయన తోసిపుచ్చారు. మొత్తం 14 అభియోగ పత్రాల్లో.. 101 కొత్తవి ఉన్నాయని తెలిపారు. సాక్షులు కూడా దీని మీద వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. 2007 జూన్ 18న మైనింగ్ లీజులకు అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. అయితే, అప్పటికే కేంద్రం వద్ద పలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

వాటి గురించి ఏమీ తేలకముందే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారని.. దీంతో ఎలాంటి లబ్ధి పొందలేదు అని చేస్తున్న వాదన సరికాదని అన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డి) ప్రకారం.. స్వయంగా లబ్ధి పొందడం కాకపోయినా ఇతరులకు ప్రయోజనం కలిగించినా.. ఈ చట్టం పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. మంత్రి నిర్ణయం వల్ల ఓఎంసీకి ఆదాయం పొందడానికి అవకాశం కలిగిందని.. లీజు మంజూరు వల్ల ప్రభుత్వానికి వచ్చేది నామమాత్రం ఫీజు మాత్రమేనని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేయాలని వారు కోరారు.

సబిత తరపు న్యాయవాది ఈ ఉమామహేశ్వరరావు ఈ వాదనల మీద అభ్యంతరం తెలిపారు. సిబిఐ ప్రవేశపెట్టిన 101 కొత్త పత్రాలని చెబుతున్నవన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించినవి అని అన్నారు. వారికి చెందిన పెట్టుబడుల వివరాలని వాటితో మంత్రికి ఏం సంబంధం, ఎలా సంబంధమో చెప్పడం లేదని వాదించారు. మంత్రికి వ్యతిరేకంగా 36 మంది సాక్షుల్లో ఎంతమంది సాక్ష్యం చెప్పారో వెల్లడించాలని అన్నారు. కేంద్రం గానీ, హైకోర్టు గానీ.. ఓఎంసీకి లీజులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండో జీవోలను తప్పు పట్టలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం మూడో అనుబంధ అభియోగపత్రంలో నిందితులుగా చేర్చారని తెలిపారు. సిబిఐ దాఖలు చేసిన ప్రస్తుత కౌంటర్లోనూ.. ప్రధాన అభియోగ పత్రంలోని అంశాలనే యధాతధంగా ఇచ్చారని అన్నారు. దీనికి సంబంధించి దానిపై పేరాల వారీగా వాదనలు వినిపిస్తానని కోరారు. దీనికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు విచారణతో పాటు కృపానందం పిటిషన్ ను మార్చి 17కు వాయిదా వేశారు.