బీఆర్ఎస్ సభ ఫ్లాప్ అయ్యిందంటున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర జాతీయ నేతలు దేశానికి దిశానిర్దేశం చేశారని పువ్వాడ అన్నారు. 

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సూపర్‌ హిట్ అయ్యిందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పార్టీ నేతలతో కలిసి గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర జాతీయ నేతలు దేశానికి దిశానిర్దేశం చేశారని పువ్వాడ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి కేసీఆర్ సుపారీ తీసుకున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ కౌంటరిచ్చారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రత్యేకంగా సుపారీలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. వాళ్ల నేతలే చాలంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ సభ ఫ్లాప్ అయ్యిందంటున్న బండి సంజయ్.. కంటి వెలుగు పథకంలో కళ్ల పరీక్ష చేయించుకోవాలంటూ మంత్రి చురకలంటించారు. 

ALso REad: అగ్నిపథ్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణల రద్దు, ఎల్‌ఐసీకి అండ .. బీఆర్ఎస్ లక్ష్యాలివే : ఖమ్మం సభలో కేసీఆర్

ఇకపోతే.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పాలసీ ఏంటీ, వైఖరి ఏంటనే దానిపై వివరంగా చెబుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 1.40 లక్షల టీఎంసీల వర్షపాతం నమోదవుతోందన్నారు. ప్రపంచానికే ఫుడ్ చైన్ అందించిన దేశం ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు తింటుందోని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

సహజ సంపద మన దేశ ప్రజల సొత్తుని.. అమెరికా మనకంటే రెండు రెట్లు పెద్దదని, కానీ వారి వ్యవసాయం 29 శాతం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. లక్షల కోట్ల సంపద ఎవరి సొంతమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇండియాలో మామిడి కాయలే కాదు, యాపిల్ కాయలు పండుతాయని కేసీఆర్ తెలిపారు. భారతదేశం అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని.. జలవనరులు, సాగు భూమి విషయంలో మనదేశమే అగ్రగామన్నారు. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో వున్నాయని.. కానీ కేవలం 20 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso REad: జై తెలంగాణ అని ఎందుకు అనలేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని.. తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. నష్టాలు సమాజానికి, లాభాలు ప్రైవేట్ వ్యక్తులకా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎల్ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా.. ఎల్ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్‌ను బలపరచాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కరెంట్ కార్మికులారా..? పిడికిలి బిగించండి అంటూ కేసీఆర్ కోరారు.