జై తెలంగాణ అని ఎందుకు అనలేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

ఖమ్మంలో  బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్ అయిందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్  చెప్పారు.  రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారని కేసీఆర్ ను  బండి సంజయ్ ప్రశ్నించారు.
 

BJP Telangana President  Bandi Sanjay  reacts on  KHamm BRS  Sabha

న్యూఢిల్లీ: నిన్న ఖమ్మంలో  నిర్వహించిన బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్ అయిందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విమర్శించారు. గురువారంనాడు  న్యూఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  మీడియాతో మాట్లాడారు.   నిన్న  ఖమ్మం సభకు కుమారస్వామి, నితీష్ కుమార్ ఎందుకు  రాలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ మీటింగ్ కు ఇవాళ వచ్చిన నేతలు  మరోసారి మీటింగ్ కు రారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.  దేశంపై  కేసీఆర్ ద్వేషం పెంచుకున్నాడని  బండి సంజయ్  చెప్పారు.తెలంగాణలో  24 గంటల పాటు  ఏ గ్రామానికి విద్యుత్  ఇస్తున్నారో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు.    రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో  ఎప్పుడు పోతుందో కూడా తెలియదన్నారు.  డిస్కమ్ ల కు బకాయిలను  ప్రభుత్వం చెల్లించలేదన్నారు.

తెలంగాణలో  కేసీఆర్ సర్కార్  ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తే  బోర్ల సంఖ్య ఎందుకు పెరిగిందో  చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  తెలంగాణలో బోర్ల సంఖ్య  18 లక్షల నుండి 23 లక్షలకు  పెరిగిన విషయాన్ని  బండి సంజయ్ ఈ సందర్భంగా  ప్రస్తావించారు. గోదావరి నదిలో  తెలంగాణ  రాష్ట్ర వాటా నీటిని ఎలా  ఉపయోగించుకొంటారో  చెప్పాలన్నారు.  నీటి వివాదాలు ఎలా పరిష్కరించుకుంటారని  ఆయన కేసీఆర్ ను  అడిగారు.  రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ పాటుపడితే  ఆత్మహత్యల్లో  తెలంగాణ రాష్ట్రం దేశంలోనే  నాలుగో స్థానంలో  ఎందుకు ఉంటుందని  బండి  సంజయ్ ప్రశ్నించారు. 

అగ్నిపథ్  గురించి  కేసీఆర్ ఒక్కడైనా ఆలోచించారా అని అన్నారు.. బిపిన్ రావత్ ఆలోచనే అగ్నిపథ్ అని బండి సంజయ్  గుర్తు చేశారు. బిపిన్ రావత్ కంటే  కేసీఆర్ కు ఎక్కువ తెలుసా అని బండి సంజయ్  అడిగారు..కొత్త రూల్స్ పెట్టి తెలంగాణలో  పోలీస్ రిక్రూట్ మెంట్ సక్రమంగా చేయడం లేదని  బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలోనే అందరికీ దళితబంధు అమలు చేయడం లేదన్నారు. కానీ దేశ వ్యాప్తంగా  దళిత బంధును ఎలా అమలు చేస్తారన్నారు.  దేశాన్ని నెహ్రు  జమానాకు తీసుకెళ్లేందుకు  కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని  బండి సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతికి రాని కేసీఆర్ దళితులకు  ఎలా మేలు చేస్తారని అడిగారు. 

రైతు బంధు ఒక్కటి అమలు చేస్తూ  ఇతర సబ్సీడీలను ఎత్తేశాడని  కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు.  ప్రభుత్వ పనులు చేసిన వారికి  బిల్లులు చెల్లించడానికి  డబ్బుల్లేవన్నారు. ఖమ్మం సభలో  కేసీఆర్ జై తెలంగాణ అనలేదన్నారు. తెలంగాణ సోయి అంటే ఏమిటో  ఈ దఫా ప్రజలు కేసీఆర్ కు చూపిస్తారని బండి సంజయ్  చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios