తెలంగాణలో ఇంకా 60 లక్షల టన్నుల ధాన్యం (paddy) నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు (india gate) వద్ద పారబోస్తామంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (minister prasanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఇంకా 60 లక్షల టన్నుల ధాన్యం (paddy) నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు (india gate) వద్ద పారబోస్తామంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (minister prasanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వచ్చినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదని మండిపడ్డారు. 

తెలంగాణలో రాబోయే 60లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని కూడా సేకరిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు (piyush goyal) విజ్ఞప్తి చేశామని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. దీనికి ఆయన రెండ్రోజుల సమయం ఇవ్వాలని అడిగారని... రెండ్రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెంట్‌ కమిషనర్‌ ద్వారా పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇంకా ఇవ్వలేదని.. ఇది చాలా దురదృష్టకరమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

ALso Read:‘అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు..’ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదని... తెలంగాణ రైతుల తరఫున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని.. బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. వానాకాలంలో రైతులు పండించిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

తెలంగాణలో వానాకాలంలో ఎంత పండితే అంత ధాన్యం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌లో మాట ఇచ్చారని... మీడియాతో మాట్లాడుతూ... కిషన్‌రెడ్డి కూడా హామీ ఇచ్చారని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. అయినా, దానిపై ఇంకా స్పష్టత ఇవ్వట్లేదని మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణ రైతులను తీవ్రంగా అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.