Asianet News TeluguAsianet News Telugu

రైతుల పేరిట రాజకీయం వద్దు.. గతంలో మీ పాలనలో రైతుల గోసను గుర్తుచేసుకోండి..: కోమటిరెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్ర‌తిప‌క్షాల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. 

minister niranjan reddy says do not do politics over crop damage
Author
First Published Mar 20, 2023, 4:15 PM IST

రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్ర‌తిప‌క్షాల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. అకాల వ‌ర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం  ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను అప్ర‌మ‌త్తం చేసిందని చెప్పారు. అకాల వర్షం వ‌ల్ల జ‌రిగిన పంట న‌ష్టాల‌పై రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. వర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు తాను వికారాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించామ‌ని తెలిపారు. పంట న‌ష్టాన్ని అంచ‌నా వేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు. 

కేవలం రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం చేసే దీక్ష‌ల‌ను రైతులు గ‌మ‌నిస్తారని అన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి గానీ లేదా మరొకరు గానీ తీసుకురావడం వారి బాధ్యత అని చెప్పారు. అయితే రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఆలోచన సబబు  కాదని అన్నారు. తమ ప్ర‌భుత్వం రైతులు, వ్యవసాయానికి తొలి ప్రాధాన్య‌త ఇచ్చింద‌ని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌తో రైతుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. ప్రతి ఏటా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని చెప్పారు. 

తెలంగాణ ధాన్యం కొనేది లేద‌ని కేంద్రం చెబితే కాంగ్రెస్ నేత‌లు ఎందుకు ప్రశ్నించలేదని,  రైతుల కోసం ఎందుకు దీక్షలు చేయలేదని ప్రశ్నించారు.  అకాలవర్షాలతో వచ్చిన పంటనష్టం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు పడ్డ గోసను గుర్తు చేసుకోవాలంటూ విమర్శించారు. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. రైతుల సమస్యలపై రెండ్రోజుల్లో స్పందించాలని కోరారు. లేకుంటే తాను ఈనెల 22న తిరుమలగిరి మండలంలో నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. అయితే కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి లేఖకు మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విధంగా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios