ఐటీ విచారణకు రెండో సారి మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి: కాలేజీల ఆర్ధిక వ్యవహారాలపై ఆరా
తెలంగాాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఇవాళ ఐటీ విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా భద్రారెడ్డిని ఐటీ అధికారులు విచారించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి శుక్రవారంనాడు మరోసారి ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు. గత నెల 28న మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఐటీ అదికారుల విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరు గంటల పాటు ఐటీ అధికారులు మర్రి రాజశేఖర్ రెడ్డిని, భద్రారెడ్డిని విచారించారు. ఐటీ అధికారులు అడిగిన ఫార్మెట్ ప్రకారంగా సమాచారం ఇచ్చామన్నారు. మళ్లీ విచారణకు పిలిస్తే వస్తామని కూడా చెప్పామన్నారు. తాము ఇచ్చిన సమాచారం పట్ల ఐటీ అధికారులు సంతృప్తి చెందినట్టుగా భావిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డి చెప్పారు.
ఇవాళ కూడా విచారణకు రావాలని ఐటీ అధికారులు కోరడంతో భద్రారెడ్డి ఇవాళ కూడా ఐటీ విచారణకు హాజరయ్యారు. మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల ఆర్ధిక వ్యవహరాలపై ఐటీ అధికారులు కేంద్రీకరించారు. మెడికల్ కాలేజీ డొనేషన్ల వ్యవహరాలపై ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఐటీ అడిగిన సమాచారాన్ని అందించారు భద్రారెడ్డి. బ్యాంకు అకౌంట్లతో పాటు సీట్ల పేమెంట్లపై వివరాలను అందించారు భద్రారెడ్డి. ప్రభుత్వ ఫీజుల కంటే అధిక మొత్తంలో డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. ఇంజనీరింగ్ , మెడికల్ కాలేజీల్లో డొనేషన్లు తీసుకున్నారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. గత నెల 22, 23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల కు సుమారు 50 మంది ఐటీ అధికారుల బృందం న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు వచ్చింది. ఉదయం నుండి రాత్రి వరకు ఐటీ అధికారుల సోదాలు సాగాయి.
గత నెల 22,23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో సోదాలుజరిగాయి. ఈ సోదాల సమయంలో తన కొడుకు మహేందర్ రెడ్డి నుండి ఐటీ అధికారులు బలవంతంగా సంతకాలు చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.ఈ విషయమై మహేందర్ రెడ్డి సోదరుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మరో వైపు ఐటీ అధికారి రత్నాకర్ కు చెందిన ల్యాప్ టాప్ ను మల్లారెడ్డి వర్గీయులు తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు మంత్రి మల్లారెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై ఐటీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ ఆధారంగా ఈ కేసుపై హైకోర్టు స్టే విధించింది.