తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పార్టీ కార్యకర్త బిడ్డ పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన నవాజ్ హుస్సేన్  టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు.

పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా హైదరాబాద్‌లోనే వుంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ సమయంలోనే నవాజ్ మామ చనిపోయారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీకి తన అవసరం వుందని భావించిన నవాజ్.. అంత్యక్రియలకు సైతం వెళ్లకుండా హైదరాబాద్‌లోనే వుండిపోయాడు.

మరోవైపు.. ఖాజా నవాజ్ హుస్సేన్ భార్య తొమ్మిది నెలల గర్భవతి. అయినప్పటికీ ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటూ భార్యకు ధైర్యం చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు.

కాగా, శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమయంలో నవాజ్ విషయం ప్రస్తావనకు రావడంతో కేటీఆర్‌ ఆయన యోగక్షేమాలు ఆరా తీశారు.

ఈ సందర్భంగా.. శనివారం ఖాతా కూతురు నబీలా మహమ్మద్ పుట్టినరోజని తెలుసుకున్న కేటీఆర్ ఆమెకు కేక్, సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపాల్సిందిగా స్థానిక నేతల్ని ఆదేశించారు. అంతేకాదు స్వయంగా ఫోన్ చేసి పాపతో మాట్లాడారు. ఈ సంతోషంతో కేటీఆర్‌కు పాప కృతఙ్ఞతలు చెప్పింది.

తన పుట్టిన రోజున ఏం కావాలి అని పాపను మంత్రి అడిగారు. తెలంగాణ గెలిస్తే చాలని ఆ పాప సమాధానం ఇచ్చింది. ఈ సమాధానంతో కేటీఆర్ చలించిపోయారు. టీఆర్‌ఎస్ పార్టీ పట్ల కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు