తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీకి విద్వేషం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తల్లిని చంపి.. బిడ్డను కాపాడారని మోదీ 8 ఏళ్ల క్రితం మాట్లాడరని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు.
తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీకి (narendra modi) విద్వేషం ఉందని మంత్రి కేటీఆర్ (ktr) అన్నారు. తల్లిని చంపి.. బిడ్డను కాపాడారని మోదీ 8 ఏళ్ల క్రితం మాట్లాడరని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీని బొందా పెట్టాలన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ మాట్లాడుతూ.. తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని అంటున్నారని.. చట్ట సభలలో బిల్లుపై ఎప్పుడు ఓటింగ్ జరిగినా తలుపులు మూసేస్తారని కేటీఆర్ తెలిపారు. ఈ విషయం కూడా తెలియని వ్యక్తి ప్రధానిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీ ఇక్కడ నూకలు చెల్లాయని అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీకి, మోదీకి తెలంగాణలో స్థానం ఉండలా వద్దా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసైందన్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. కేంద్రం ఎనిమిదేళ్లలో తెలంగాణ చేసిందేమి లేదని అన్నారు. ఏడున్నర ఏళ్లలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను ఇవ్వలేదని మండిపడ్డారు.
తెలంగాణపై మాట్లాడటానికి మోదీకి సిగ్గుండాలని తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. దేశంలో ఒకే ఒక్క తప్పు జరిగిందని.. అది 2014లో మోదీని ప్రధానిగా ఎన్నుకోవడమేనని విమర్శించారు. సిరిసిల్ల పవర్‌లూమ్ క్లస్టర్ కావాలని ఎనిమిదేళ్లుగా అడుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ చెప్పిన కూడా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదని అన్నారు. బీజేపీ నేతలు అడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్‌పై ఇష్టం వచ్చిన మాట్లాడితే తప్పకుండా బుద్ది చెప్తామని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమి నాయకుడో అర్థం కావడం లేదన్నారు. కుంభమేళకు రూ. 300 కోట్లు ఇచ్చి.. మేడారం జాతరకు ముష్టి రూ. 2.5 కోట్లు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. మినీ కుంభమేళాకు కనీసం రూ. 100 కోట్లు ఎందుకు కేటాయించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. వేములవాడకు పైసా తీసుకురాని బండి సంజయ్ ఎంపీగా ఎందుకు ఉన్నావ్ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ వస్తే ఆగమైతదని అనాడు కొందరు మాట్లాడరు.. కానీ అభివృద్దిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులేదనని అన్నారు. పార్టీ మీటింగ్‌లకు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
