Asianet News TeluguAsianet News Telugu

నేను చెప్పేది వాస్తవం కాకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాలు

బీజేపీ తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతుందని విమర్శించారు. 

Minister ktr speech at public meeting in narayanpet district
Author
First Published Jan 24, 2023, 5:30 PM IST

బీజేపీ తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతుందని విమర్శించారు. నారాయణపేట ప్రగతి నివేదిక సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దగుల్బాజీ డైలాగులు కొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టుగా పనికిమాలిన మాట్లాడుతున్నారని.. తెలంగాణకు చేసిన ఒక్క పని చెప్పమంటే మాత్రం సమాధానం ఉండదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ  తరహా సంక్షేమ పథకాలు  ఎందుకు లేవని ప్రశ్నించారు. కర్ణాటకలో రైతు బంధు ఎందుకు లేదో బీజేపీ నేతలు సమాధానం  చెప్పాలని అన్నారు. 

పదే పదే రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నామని బీజేపీ నేతలు అంటారని.. అప్పులపై తన సవాలును మాత్రం స్వీకరించడం లేదని అన్నారు. మోదీ కంటే ముందు ఉన్న 14 మంది ప్రధానుల కంటే ఆయన ఎక్కువ అప్పులు చేశారని ఆరోపించారు. 14 మంది ప్రధానులు రూ. 50 లక్షల కోట్లు అప్పులు చేశారని.. ప్రధాని మోదీ ఒక్కరే వంద లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఆ వంద లక్షల కోట్ల రూపాయలతో ఏం చేశారంటే చెప్పే మొహం లేదని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్‌‌పై అదనపు సెస్ వేసి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేశారని విమర్శించారు. ఆ డబ్బులు ఏం చేశారంటే చెప్పే బీజేపీ నేత లేరని అన్నారు. 

బీజేపీ నేతలకు పాలమూరుపై ప్రేమ ఉంటే.. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పాల‌మూరు నుంచి మోదీ ఎంపీగా పోటీ చేయాల‌ని బీజేపీ నాయ‌కులు అంటున్నారని.. ఇక్కడి ప్రజలు ఆయనకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. పాల‌మూరు -రంగారెడ్డి ప‌థ‌కానికి మోకాల‌డ్డు పెట్టినందుకా? కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా పాలమూరు ప్రజలకు కేంద్రం అన్యాయం చేస్తున్నందుకా? అని ప్రశ్నించారు. సిలిండర్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు మోదీ దేవుడా? అని మండిపడ్డారు. 

బ్లాక్‌మనీ తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని మోదీ మోసం చేశారని మండిపడ్డారు. రైతులకు రూ. 5 లక్షల బీమా కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మోదీ చెప్పేది దేశం కోసం.. ధర్మం  కోసం.. కానీ పనిచేసేది మాత్రం ఇద్దరి కోసమేనని విమర్శించారు. ఇద్దరు గుజరాతీలు అమ్ముతున్నారని.. ఇద్దరు గుజరాతీలు కొంటున్నారని విమర్శించారు. మోదీ పాలనలో కార్పొరేట్లకు రూ. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని అన్నారు. తాను చెప్పేది వాస్తవం కాకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తాను చెప్పేది వాస్తవం అయితే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  రైతులకు ఇన్‌కమ్ ట్యాక్స్ వేయాలని ప్రధాని ఆర్థిక సలహాదారు అంటున్నారని.. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని అన్నారు. మోదీ కంటే అసమర్ద ప్రధాని, పనికిమాలిన ప్రధాని ఇప్పటివరకు భారతదేశంలో ఎవరూ రాలేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios