Asianet News TeluguAsianet News Telugu

సమీపంలోని బయ్యారంకు కుదరదు.. కానీ 1800 కి.మీ దూరంలోని ముంద్రాకు ఎలా సాధ్యం?: కేటీఆర్

కేంద్రంలోని అధికార మోదీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నష్టాలను అందరికీ పంచి.. లాభాలను కొందరికి అంకితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు. 

Minister KTR Slams Modi and adani over bailadila iron ore ksm
Author
First Published Apr 11, 2023, 1:28 PM IST

కేంద్రంలోని అధికార మోదీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నష్టాలను అందరికీ పంచి.. లాభాలను కొందరికి అంకితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమనేది తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వివరంగా తెలియజేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరంగా కూడా కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేశారు.  రైతు బీమాను ప్రవేశపెట్టినప్పుడు ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పటికీ.. ఎల్‌ఐసీ అప్పగించారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేయడాన్ని మాటల్లోనే కాకుండా.. చేతల్లో చూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

కేటీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విశాఖ ఉక్కు విషయంలో చూపెడుతున్న ఆసక్తి, బయ్యారం విషయంలో ఎందుకు లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. ఎప్పుడు ఏం  మాట్లాడతారో తెలియదని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క సంబంధం ఉందని అన్నారు. 

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటును పరిశీలిస్తామని విభజన చట్టంలోనే  ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెడతామని కేంద్రం  చెప్పిందని తెలిపారు. 2014 నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉన్నామనిచెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన ఎలాంటి  ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. తాను స్వయంగా ప్రధానిని  కలిశానని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే 15 నుంచి 20 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపానని అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ బయ్యారానికి సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పానని తెలిపారు. 

బయ్యారం సమీపంలో బైలదిల్లా ఉందని.. అది 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ లభించే గని అని అన్నారు. అయితే అప్పుడు కుట్ర జరుగుతుందని తమకు తెలియదని  చెప్పారు. బైలదిల్లాను అదానీకి  కట్టబెట్టారని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు చావు దెబ్బతిన్నాయని అన్నారు. అందుకే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఆచరణ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతారని విమర్శించారు. 

బైలదిల్లా నుంచి 150 కి.మీ దూరం బయ్యారం ఉందని.. 600 కి.మీ దూరంలో విశాఖ ఉందని.. సమీపంలో ఉన్నవాటికి ఖనిజాన్ని తరలించడం సాధ్యం కాదని.. బైలదిల్లా నుంచి 1800 కి.మీ దూరంలో ఉన్న ముంద్రాకు తరలించడం మాత్రం ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వైజాగ్ పొట్టగొడుతున్నది, బయ్యారంను ఎండపెడుతున్నది  ప్రధాని- అదానీలు అని విమర్శించారు. ప్రధాని, అదానీ కలిసి తెలుగు రాష్ట్రాల సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాట తప్పైతే పరువు నష్టం  దావా వేసుకోవచ్చని అన్నారు. 

ప్రధాని జాతి ప్రాజెక్టులను దోస్తులకు అంకితం చేస్తున్నారని ఆరోపించారు. బైలాదిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడిందని విమర్శించారు. బైలదిల్లా మొత్తంగా ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన జాతి సంపద అని చెప్పారు. బైలదిల్లా అదానీ కబంధ హస్తాల నుంచి బయపడితే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను బతికించవచ్చని, బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. బైలదిల్లా తప్ప మరొకరు ప్లాంట్ పెట్టలేరని.. ఏదో ఒక రూపంలో ఆ పని చేస్తారని విమర్శించారు. 

అదానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేస్తున్నారనేది అందరికి తెలుసని అన్నారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీ గుంజుకున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఈడీ, సీబీఐలు వస్తాయని అన్నారు.  గనుల కేటాయింపు చేయక, ఇవ్వాల్సిన ఐరన్ ఓర్ ఇవ్వక బలవంతంగా నష్టాల్లోకి నెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

పీవీ నర్సింహారావు, వాజ్‌పేయి‌లు ప్రధానులుగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు అప్పు ఇచ్చారని.. ఆ తర్వాత దానిని స్టీల్ ప్లాంట్ వడ్డీతో కలిపి చెల్లించిందని అన్నారు. తాము ఆంధ్రలో రాజకీయం చేయడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను, తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని, జాతి సంపదను వారి దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నాం 

తమ అధికారులు బృందం వైజాగ్ వెళ్లిందని.. ఏం చేయాలనే దానిపై స్టడీ చేస్తుందని చెప్పారు. బైలాదిల్లా అదానీ చేతిలో ఉండమే సమస్యగా మారిందని విమర్శించారు. అదానీగా ఇచ్చిన బైలాదిల్లా కాంట్రాక్టును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. అలా చేసి గనులను కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతుకుందని.. బయ్యారం ఉక్కు  పరిశ్రమ  ఏర్పాటు అవుతుందని అన్నారు.  ఏపీ ప్రభుత్వం ఏం  చేస్తుందో తమకు అనవసరం అని.. తమ పోరాటం కేంద్రం మీదనేనని స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇందుకోసం రూ. 250 కోట్లైనా ఖర్చు పెట్టేందుకు తమ  ప్రభుత్వం  సిద్దంగా ఉందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios