కాంగ్రెస్ కావాలా.. కరెంట్ కావాలా , ఆ పార్టీ అంటే కరెంట్ ఖతమే : కేటీఆర్ వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు 11 అవకాశాలు ఇస్తే ఏం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ ఖతమేనని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు 11 అవకాశాలు ఇస్తే ఏం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో జరిగిన విద్యార్ధి యువ ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ కావాలో, కరెంట్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ ఖతమేనని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
సాయంత్రం హైదరాబాద్ సోమాజీగూడలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్ల కిందట పది రోజులు కరెంట్ లేకపోయినా అడిగేవారు కాదని, ఇప్పుడు పది నిమిషాలు కరెంట్ పోయినా ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో తగినంత విద్యుత్ వుండటం వల్లే పారిశ్రామిక వృద్ధి సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే 25 గంటలు తాగునీరు సదుపాయం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ALso Read: మా పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు: సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
అంతకుముందు మల్కాజిగిరిలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజలను డబ్బుతో, గుండాయిజంతో భయభ్రాంతులకు గురిచేసేవాడని హరీశ్ రావు ఆరోపించారు. ఆయన లాగా తాము వ్యవహరించలేదని రాజకీయ విమర్శలు చేయాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు చేయకూడదని మంత్రి హితవు పలికారు.
మల్కాజిగిరి నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని.. ప్రతి నెలా తాను ఇక్కడికి వచ్చి సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు. బీజేపీ నేతలు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని హరీశ్ రావు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పథకాలను బీజేపీ కాపీ కొట్టిందని.. రాష్ట్రంలో మంచినీటి సమస్యను తీర్చామని, ప్రతి జిల్లాకు 100 పడకల ఆసుపత్రి ఇచ్చామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గల్లీకో పేకాట క్లబ్బు వుండేదని.. కేసీఆర్ అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులన్నీ మూసేశారని హరీశ్ చెప్పారు.