మా పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు: సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తన విమర్శల తీవ్రతను పెంచారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏ రకంగా నష్టం చేసిందో తన ప్రసంగాల్లో వివరిస్తున్నారు.
కాగజ్ నగర్:కాంగ్రెస్ ఢోకా బాజీ పార్టీ అని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బుధవారంనాడు సిర్పూర్ కాగజ్ నగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. .2004 ఎన్నికల ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికలు అవగానే ఈ హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆయన విమర్శించారు.తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని తాను దీక్ష చేపడితే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. బలవంతంగా ఆంధ్రలో తెలంగాణను కలపడం వల్ల ఎంతో నష్టపోయామని కేసీఆర్ చెప్పారు.
also read:మరోసారి మొరాయించిన కేసీఆర్ హెలికాప్టర్: రోడ్డు మార్గంలోనే సిర్పూర్ నుండి ఆసిఫాబాద్ కు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడ 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూములు ధరలు పెరిగాయని ఆయన తెలిపారు.మనం వేసే ఓటు భవిష్యత్తును నిర్ణయిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఓటు వేసే ముందు మన భవిష్యత్తు కోసం పాటుపడే వారి గురించి ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు.24 గంటల విద్యుత్ దుబారా అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం గురించి కేసీఆర్ ప్రస్తావించారు.
మళ్లీ కరెంట్ లేకుండా చీకటి రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ధరణి వద్దని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేసీఆర్ ప్రస్తవిస్తూ ధరణి ఎత్తివేస్తే మళ్లీ రైతులకు కష్టాలొస్తాయన్నారు. భూములపై రైతులకే హక్కు ఉండేలా ధరణిని తెచ్చామన్నారు. ధరణిని ఎత్తివేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని కేసీఆర్ విమర్శించారు. ఏ ఊరిలో పండే ధాన్యాన్ని ఆ ఊరిలోనే కొంటున్నామని సీఎం చెప్పారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే కోనేరు కోనప్పను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తమ పార్టీ విజయం సాధించే సీట్లలో సిర్పూర్ కాగజ్ నగర్ ప్రథమస్థానంలో ఉంటుందని ఆయన చెప్పారు.
పోడు భూముల పట్టాల పంపిణీకి కేంద్రం అడ్డంకిగా మారిందన్నారు.సిర్పూర్ కాగజ్ నగర్ లో 16 వేల మందికి పట్టాలు అందించిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.