విశ్వనగరంలోనూ సమస్యలు తప్పవని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోనూ సమస్యలు వున్నాయని.. వాటిని అధిగమిస్తూ అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. బేగంపేటలోని ధనియాలగుట్టలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వనగరంలోనూ సమస్యలు తప్పవని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వుండే సమస్యలు అక్కడా వుంటాయని.. భూమ్మీద మనిషి వున్నంతకాలం కూడా సమస్యలు వుంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అలాగే ప్రస్తుతం హైదరాబాద్ న్యూయార్క్‌ను తలపించేలా వుందని సూపర్‌స్టార్ రజనీకాంత్, హీరోయిన్ లయ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భగా ప్రస్తావించారు. ఏ నగరమైనా విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఫ్లై ఓవర్లు, మెరుగైన రవాణా వ్యవస్థ , మంచినీటి సరఫరా, 24 గంటల కరెంట్ తప్పనిసరని మంత్రి పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అద్భుతంగా మారిందన్నారు.
జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం కంటే అద్భుతంగా ధనియాలగుట్టలోని వైకుంఠధామాన్ని నిర్మించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోనూ సమస్యలు వున్నాయని.. వాటిని అధిగమిస్తూ అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు. మంచి నాయకులను, ప్రభుత్వాలను కాపాడుకోవాలని.. సమర్ధుడైన కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా గెలిపించుకోవాలని కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
