Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్‌... ప్రజల కోరిక ఇదే, సీఎంతో చర్చిస్తా: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కంటోన్మెంట్‌‌పై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. మెజారిటీ ప్రజలు కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపాలని కోరుకుంటున్నారని చెప్పారు .

minister ktr sensational comments on secunderabad cantonment
Author
Hyderabad, First Published Sep 23, 2021, 6:29 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కంటోన్మెంట్‌‌పై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. అక్కడ ఎలాంటి స్కీంలు అమలు చేయలేని పరిస్ధితి నెలకొందన్నారు. మెజారిటీ ప్రజలు కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపాలని కోరుకుంటున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా రోడ్లు , స్కైవేలు వేయలేని పరిస్ధితి నెలకొదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతకుముందు హైదరాబాద్ నగరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 1950 ఎంఎల్‌టీల మురికినీరు ప్రతిరోజూ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. అదే జీహెచ్ఎంసీ వరకే చూస్తే 1600 ఎంఎల్‌టీల మురికినీరు ఉత్పత్తి అవుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో వున్న ఎస్‌టీపీల సామర్ధ్యం 772 ఎంఎల్‌టీలు మాత్రమేనని మంత్రి చెప్పారు.

ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనతో పాటు చెరువులు బాగుపడాలని కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మురుగునీరు మరింత పెరుగుతుందని ఓ సంస్థ చేత అధ్యయనం చేయించామని మంత్రి తెలిపారు. ఎస్‌టీపీల ఏర్పాటుకు సంబంధించి దాదాపు 3 వేల కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటి వల్ల చెరువులు, నాళాలు కూడా బాగుపడతాయని మంత్రి చెప్పారు. హైదరాబాద్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు

Follow Us:
Download App:
  • android
  • ios