కాంగ్రెస్ రాబందుల పార్టీ అని.. రాహుల్‌కు వడ్లు, ఎడ్లు తెలియవని.. ఆయనకు పబ్బు, క్లబ్బులు మాత్రమే తెలుసునంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏనాడూ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. 

ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు వారు ఆందోళనలు సైతం నిర్వహించారు. తాజాగా ఉచిత విద్యుత్‌పై స్పందించారు మంత్రి కేటీఆర్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దశాబ్ధాలుగా రైతులను దగా చేసిందన్నారు. రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఏనాడూ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. మూడెకరాల పొలం తడవాలంటే 3 గంటలు సరిపోతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రాసిందే రాత, గీసిందే గీత అన్నట్లుగా పరిస్థితి వుందని.. కాంగ్రెస్ సన్నాసుల మాట వినొద్దంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాబందుల పార్టీ అని.. రాహుల్‌కు వడ్లు, ఎడ్లు తెలియవని.. ఆయనకు పబ్బు, క్లబ్బులు మాత్రమే తెలుసునంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. 

కాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ చంద్రబాబు చెప్పులు మోశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం వేమూరి రాధాకృష్ణ, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండలవ వెంకటేశ్వరరావుల ప్రదక్షిణం చేసేవాడని ఆరోపించారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కోటి రూపాయలు ఇస్తే.. అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడని చెప్పారు. గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

ALso Read: ఆంధ్రావాళ్ల పైసలతో టీఆర్ఎస్ పెట్టారు.. టీడీపీ సహాయంతోనే కేటీఆర్ ఎమ్మెల్యే.. మీరు పరాన్నజీవులు: రేవంత్ ఫైర్

హరీష్ రావు కనీసం వార్డు మెంబర్‌గానైనా గెలువకముందే ఆయనను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని అన్నారు. టీడీపీ సహకారంతోనే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతోనే మీరు బతికారని, మీరు పరాన్న జీవులని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009లో టీడీపీపై విరుచుకుపడ్డ కేసీఆర్ ఆ తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, టీడీపీ దయాదాక్షిణ్యాలతోనే టీఆర్ఎస్ మళ్లీ రాజకీయ మనుగడ సాధించిందని పేర్కొన్నారు. అదే సందర్భంలో సిరిసిల్లలో ఓటమి నుంచి 150 ఓట్ల మెజార్టీతో బయటపడ్డాడని వివరించారు.

అలాగే, ఉచిత కరెంట్ అంశంపైనా మాట్లాడారు. తాను అమెరికాలో మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఉచిత కరెంట్ తెచ్చింది తొలిసారిగా కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నదని, ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. 3,500 సబ్ స్టేషన్‌లలో ఎక్కడ 24 గంటలు ఇచ్చినా.. తాము అక్కడ ఓట్లు అడగబోమని సవాల్ విసిరారు. అదే విధంగా బీఆర్ఎస్ కూడా ఓట్లు అడగవద్దని చాలెంజ్ చేశారు. ప్రతి సబ్ స్టేషన్ వద్ద గ్రామ సభలు, రచ్చబండ, రైతులతో చర్చ పెడదామని అన్నారు.