ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు కాంగ్రెస్ తరపున ప్రియాంక క్షమాపణలు చెప్పాలన్నారు .
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పొలిటికల్ టూరిస్ట్‌లకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందని కేటీఆర్ సెటైర్లు వేశారు. ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్‌ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకుని, రాష్ట్ర ప్రజలకు అందుకున్న ఫలితాలను తెలుసుకోవాలని హితవు పలికారు.
దేశంలో నిరుద్యోగ సమస్యకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇందుకు ఈ రెండు పార్టీలు యువతకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు కాంగ్రెస్ తరపున ప్రియాంక క్షమాపణలు చెప్పాలన్నారు . సోనియాను బలిదేవత అన్న వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టారని.. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్‌లో వుందని.. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్ట్‌లను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ నేతలకు ప్రియాంక గాంధీ బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగంలో 2.2 .. ప్రైవేట్ రంగంలో 22 లక్షలకు మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
Also Read: మల్లికార్జున ఖర్గే ఫ్యామిలీకి బెదిరింపులు: బీజేపీ అభ్యర్ది మణికంఠపై రేవంత్ ఫిర్యాదు
ఇదిలావుండగా.. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించిన చిట్టాపూర్ బీజేపీ అభ్యర్ధి మణికంఠ రాథోడ్ ను ఆ పార్టీ నుండి బహిష్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారంనాడు రేవంత్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలోని చిట్టాపూర్ బీజేపీ అభ్యర్ధి మణికంఠ రాథోడ్ పై జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
హైద్రాబాద్ లో గాడ్సే ఫోటో ప్రదర్శించిన వారిపై ఏం చర్యలు తీసుకొన్నారని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో బ్యాంకులను జాతీయ చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసిన ఇందిరా గాంధీ మనమరాలు ప్రియాంక గాంధీ కాళ్లు మొక్కి క్షమాపణలు కోరాలని కేటీఆర్ కు సూచించారు . ప్రియాంక గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్టుగా కేటీఆర్ పేర్కొనడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ లో అనేక కీలక బిల్లులకు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. గాడ్సేకు మద్దతిచ్చే పార్టీతో బీఆర్ఎస్ అంటకాగిందని .. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పుడూ కలిసే ఉన్నాయన్నారు.
