నల్గొండలో ఒక్కరి ఖాతాలోనే డబ్బులు... పేదల సంగతేంటీ మోడీజీ : రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు
నల్గొండ జిల్లాలో ఒక్కరి ఖాతాలోనే జిల్లా వాసులందరి డబ్బులు పడ్డట్టుగా వున్నాయంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కార్పోరేట్ పెద్దలకు 11.5 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని.. సామాన్యులకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతోందని ఆయన దుయ్యబట్టారు.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కులాల సంఘాల మద్ధతు కూడగట్టడంతో పాటు కార్మిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా శనివారం మన్నెగూడలో లారీ యజమానులు, డ్రైవర్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై... ప్రసంగించారు. అందరి అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 8 ఏళ్లలో ఏం సాధించామో ఆలోచించాలని... ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని కేటీఆర్ తెలిపారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
విద్యుత్, నీటి కొరత సమస్యల్ని ... నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్‌కు సరకు లేదు.. పేదల సమస్యలపై సోయి లేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు, ఇతర పన్నుల ద్వారా రూ.30 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఒక్కరి ఖాతాలోనే జిల్లా వాసులందరి డబ్బులు పడ్డట్టుగా వున్నాయంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Also REad:నా అన్నపై దుష్ప్రచారం.. పాల్వాయి స్రవంతికి కేసీఆర్ డబ్బు : వెంకట్ రెడ్డి ఆడియోపై రాజగోపాల్ రెడ్డి
కార్పోరేట్ పెద్దలకు 11.5 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని.. సామాన్యులకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. పెద్దలకు మాఫీ చేయొచ్చు కానీ.. పేదలకు మాత్రం ఇవ్వకూడదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏమైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్ తీసేయాలని... 65 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అంతకుముందు శుక్రవారం మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి జీవనోపాధిని అందిస్తున్నది చేనేత రంగమేనని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు చిన్నప్పటి నుంచే చేనేత కార్మికుల కష్టాలు తెలుసునని మంత్రి వెల్లడించారు.
2002లో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కోసం కేసీఆర్ స్వయంగా జోలెపట్టి విరాళాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష చొప్పున అప్పగించారని.. 2007లో కరీంనగర్ ఎంపీగా చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు రూ.50 లక్షల నిధులను ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.70 కోట్లుగా వున్న చేనేత బడ్జెట్‌ను ఏకంగా రూ.1200 కోట్లకు పెంచారని తెలిపారు.
ALso REad:మునుగోడులో తమ్ముడికే ఓటెయ్యండి...: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ రికార్డింగ్ వైరల్
గడిచిన ఎనిమిదేళ్లలో చేనేత శాఖకు ఇప్పటి వరకు రూ.5,752 కోట్లని కేటీఆర్ చెప్పారు. ప్రతీ ఏటా కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నామని.. చేనేత కళాకారుల డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే కఠిన చర్యలు తీసుకుని లోపలేయిస్తామని మంత్రి హెచ్చరించారు. అవసరమైతే చట్టాలను మార్చేలా బాధ్యత తీసుకుంటామని.. చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు.