నా అన్నపై దుష్ప్రచారం.. పాల్వాయి స్రవంతికి కేసీఆర్ డబ్బు : వెంకట్ రెడ్డి ఆడియోపై రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో టేప్ వెలుగుచూడటం కలకలం రేపింది. అయితే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కైందన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. కవిత, రేవంత్ రెడ్డిల మధ్య ఆర్ధిక, ఇతర సంబంధాలు వున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది నాయకులు తాను గెలవాలని కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Also REad:మునుగోడులో తమ్ముడికే ఓటెయ్యండి...: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ రికార్డింగ్ వైరల్
కాగా.. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తన పిసిసి పదవినుండి తప్పించే కుట్రలు జరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే సంచలన ఆడియో ఒకటి బయటపడింది. టిపిసిసి స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలని మునుగోడు నాయకులను కోరుతూ పోన్ కాల్ ఆడియో లీక్ అయ్యింది. మునుగోడుకు చెందని కాంగ్రెస్ లీడర్ తో వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మునుగోడులో కాంగ్రెస్ ఓడితే ఈ దెబ్బతో తాను పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని... ఏదయినా వుంటే అప్పుడు చూసుకుంటానని కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు... కాబట్టి పార్టీలను చూడకుండా ఆయనకే ఓటెయ్యాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు ఆడియో వెలుగుచూసింది.