Solar Roof Cycling Track: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ అవుటర్‌లో నిర్మించిన సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మారుతున్న జీవన విధానం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని , ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Solar Roof Cycling Track: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ అవుటర్‌లో నిర్మించిన సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ అందుబాటులోకి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 23 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ట్రాక్ నార్సింగి నుంచి పోలీసు అకాడమీ వరకు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయబడింది.

హెల్త్ వే కార్యాచరణలో భాగంగా ఈ 23 కిలోమీటర్ల మేర ట్రాక్ వేయగా..ట్రాక్ తో 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కావడం విశేషం. సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మునిసిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మారుతున్న జీవన విధానం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ లాంటి శారీరక శ్రమ వ్యాయమాలుచేయాలని అన్నారు. గతంతో పోల్చితే .. మనం సుఖవంతమైన జీవనానికి అలవాటు పడుతున్నామనీ, ఆదాయం పెరిగే కొద్దీ సైకిల్స్.. బైక్స్.. కార్లు.. ఇలా కొంటూ వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లోని పెద్ద అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి ఒక ఇంట్లోనే రెండు కార్లు ఉంటున్నాయని, అలాంటివారికి శారీరక శ్రమ ఏముంటుందని ప్రశ్నించారు. సైక్లింగ్ అనేది చాలా మంచి వ్యాయామమని, ఈ ట్రాక్ ను సద్వియోగం చేసుకోవాలని అన్నారు. 

హైదరాబాద్ లో సైక్లిస్టు లను చూస్తే సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ మొత్తం గండిపేట చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. నార్సింగి సైకిల్ ట్రాక్ దేశంలోనే మొదటి సోలార్ రూఫ్ ట్రాక్ అని తెలిపారు. మున్ముందు మరిన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

హైదరాబాద్ ను సైక్లింగ్ కాపిటల్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ రేసులు సైతం ఇక్కడ జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి.. మన పరిస్థితులకు అనుగుణంగా సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మించినట్లు వివరించారు. ఈ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ద్వారా 32వేల స్ట్రీట్ లైట్స్ కు పవర్ సప్లయ్ చేయవచ్చనీ, ఆరేళ్లలో సోలార్ పవర్ ద్వారా ట్రాక్ నిర్మాణ వ్యయం వెనక్కి వచ్చేస్తుందన్నారు. 16వేల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసామని కేటీఆర్ వెల్లడించారు.

ప్రత్యేకతలివే..

అవుటర్‌ రింగ్ రోడ్డులో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను నిర్మించబడింది. హెల్త్ వే థీమ్ తో 23 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కావడం విశేషం. నార్సింగి-గండిపేట మార్గంలో 4.25 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల్లో ట్రాక్ ను నిర్మించారు. ఈ ట్రాక్‌పై సోలార్‌ రూఫ్‌ ఏర్పాటు చేయడంతో దాదాపు 16 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

మరో వైపు భద్రతకు ఏ మాత్రం లోటు లేకుండా.. ట్రాక్‌ పొడవునా సీసీ కెమెరాలను బిగించారు. అలాగే.. ట్రాక్ మధ్యలో ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్స్, తాగునీటి సదుపాయాలు, సైకిల్‌ రెంటల్‌ స్టోర్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. సైక్లింగ్ చేసేవారికి ఆహ్లాదకర వాతావరణం అందించేలా ట్రాక్‌ పొడవునా వివిధ రకాల మొక్కలను నాటారు.