Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్‌, కేసీఆర్‌పై వ్యాఖ్యలు : ఊకదంపుడు మాటలొద్దు.. ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి టార్గెట్ చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు మరోసారి కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్ . ఊకదంపుడు ప్రసంగాలు, మాటలతో రైతుల ఆదాయం రెట్టింపు కాదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతుల పరిస్ధితి బాగుందని మంత్రి స్పష్టం చేశారు. 
 

minister ktr counter to pm narendra modi over his comments on brs party ksp
Author
First Published Oct 5, 2023, 6:58 PM IST

ఇటీవల తెలంగాణలో పర్యటించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు మరోసారి కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. గురువారం రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద అత్యాధునికంగా నిర్మించిన విజయ మెగా డెయిరీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఊకదంపుడు ప్రసంగాలు, మాటలతో రైతుల ఆదాయం రెట్టింపు కాదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని మోడీ పదేళ్ల క్రితం చెప్పారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్ప దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో రైతుల కష్టాలు డబుల్ అయ్యాయని కేటీఆర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతుల పరిస్ధితి బాగుందని మంత్రి స్పష్టం చేశారు. 

అంతకుముందు బుధవారం నిర్మల్ జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గాలి మోటార్ లో వచ్చి  గాలి మాటలు చెప్పారని మంత్రి మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు, పచ్చి అబ్బదాలు చెప్పారనీ, బీజేపీ తన అసత్య ప్రచారంతో  ప్రజలను పక్కదోవ పట్టించాలని భావిస్తోందని ఆరోపించారు. ప్రధాని చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని, తాను ముఖ్యమంత్రి కావాలంటే.. రాష్ట్ర ప్రజలు తన వెంటనే ఉంటే చాలనీ, ఇతర పార్టీల నేతల సపోర్ట్ తన అవసరం లేదని తెలిపారు. 

ALso Read: నేను సీఎం కావడానికి మీ పర్మిషన్ ఎందుకు .. మీరు భయపెడితే భయపడం : మోడీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

అయినా తని ముఖ్యమంత్రి చేయడానికి ప్రధాని మోదీ మద్దతు ఎన్వోసీ ఎందుకని ప్రశ్నించారు. తమ గులాబీ పార్టీ ఎవరికి గులాంగిరి చేయదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు పెరుగుతున్న క్రేజ్ చూసి, ఈ రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని అందుకే కావాలని  తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బీ పార్టీ కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ రంగంలో చూసిన అభివృద్ధి కనిపిస్తుందని, ప్రధాని మోడీ ఎన్నికలలో చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలేనని, ఇప్పటివరకూ జన్ ధన్ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం  రైతుబంధు ద్వారా వేలాది మంది ఆర్థిక సాయం అందించిందని, పేదల రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios