హైద‌రాబాద్ న‌గ‌రం విశ్వ‌న‌గ‌రంగా మారాల‌న్న‌, బాగుప‌డాల‌న్నా ప్రజల భాగ‌స్వామ్యం త‌ప్ప‌నిస‌రి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రం విశ్వ‌న‌గ‌రంగా మారాల‌న్న‌, బాగుప‌డాల‌న్నా ప్రజల భాగ‌స్వామ్యం త‌ప్ప‌నిస‌రి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఖైర‌తాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ 10వ వసంతంలోకి అడుగుపెడుతుందని.. సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్ నివేదిక‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌కు సంబంధించి విడుద‌ల చేసిన తాజా బుక్‌లో తెలంగాణ అగ్ర‌భాగాన నిలిచిందని చెప్పారు.

దేశంలోనే హైద‌రాబాద్ ఉత్త‌మ న‌గ‌రంగా ఉంద‌ని ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించాయ‌ని అన్నారు. అయితే ప్ర‌పంచంతో పోల్చితే విశ్వ‌న‌గ‌రం కావాలంటే చాలా మైళ్ల దూరం ప్ర‌యాణించాల్సి ఉందని చెప్పారు. మాన్‌సూన్‌కు సంబంధించి చాలా ప‌నులను ప‌ర్య‌వేక్షిస్తున్నామని చెప్పారు. నాలాలను క్లీనింగ్ చేసేటప్పుడు.. కొన్ని వస్తువులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని కామెంట్స్ చేశారు. సూప‌ర్ మార్కెట్లో కూడా దొరుకుతాయో లేదో కానీ నాలాలో అన్ని దొరుకుతున్నాయని అన్నారు.


ఇల్లు మాత్ర‌మే నాది.. నాలా నాది కాదు అనే భావ‌న‌తో బ‌త‌కొద్దు అని అన్నారు. ప్రజల్లో మార్పు రాకపోతే ఎంతగా ప్రయత్నించినా, ఎంత డబ్బు ఖర్చు చేసిన ఫలితం ఉండదని అన్నారు. న‌గ‌రం బాగుప‌డాలంటే పౌరుల భాగ‌స్వామ్యం త‌ప్ప‌కుండా అవ‌స‌రం అని స్పష్టం చేశారు. అంద‌రం క‌లిసి క‌దిలితేనే మార్పు వ‌స్తుందని అన్నారు.