హైదరాబాద్: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(ఆదివారం) ఆరు జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి జరుగుతున్న ఎన్నిల్లో భాగంగా షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

ఓటేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ... ఇంట్లోంచి బయలుదేరేముందు గ్యాస్ సిలిండర్ కు మొక్కానని అన్నారు. గత ఎన్నికల్లో నమోదయిన అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యిందని... ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. 
 

విద్యావంతులు, యువకుల సమస్యలను అర్థం చేసుకొని తీర్చగలిగే సామర్థ్యము, అవకాశం ఉన్న అభ్యర్థికే ఓటు వేశానన్నారు కేటీఆర్. విద్యావంతులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనరన్న అపవాదు ఉందని.... దాన్ని తొలగించుకొని గ్రాడ్యుయేట్లు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని మంత్రి సూచించారు. అభివృద్ధికి పాటుపడిన అభ్యర్థికి ఓటు వేయాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ తమ బాధ్యతగా బయటకు వచ్చి ఓటు వేయాలని విద్యావంతులకు విజ్ఞప్తి చేసారు కేటీఆర్.  

ఇక ఇదే షేక్ పేట తహసిల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిసన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ దంపతులు. కేటీఆర్ వెంటే పోలింగ్ కేంద్రానికి వచ్చిన వీరు ఓటుహక్కును వినియోగించుకున్నారు.