Ask KTR:తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు ట్విటర్ వేదికగా.. Ask KTR అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
Ask KTR: సోషల్ మీడియా ఖాతాల డీపీలను మార్చడం కాదు.. దేశ జీడీపీని మార్చాలని తెలంగాణ మంత్రి కేటీఆర్... ప్రధాని మోడీకి సలహా ఇచ్చారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశప్రజలంతా తివర్ణ పతాకాన్ని సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫైల్ పిక్ (డీపీ)గా పెట్టుకోవాలంటూ ప్రధానిమోడీ జాతికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ .. ట్విట్టర్ వేదికగా #Ask KTR పేరిట శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలతో ఆన్‌లైన్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు వివిధ అంశాలపై పలువురు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమం దాదాపు రెండు గంటల పాటు సాగింది.
మునుగోడు మాదే.. కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే !
మునుగోడు ఉప ఎన్నిక గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఒక అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక మాత్రమే.. ఆ ఎన్నికతో ఏం మారుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. మునుగోడు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది.. తెలంగాణ ప్రభుత్వమే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ నేతృత్వంలో మూడోసారి విజయం సాధించి ప్రభుత్వాని నిలబెడుతామనీ, టీఆర్ ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని అని మంత్రి కేటీఆర్ అన్నారు.
"వచ్చే ఎన్నికలకు తెరాసకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఒకేసారి రెండు జాతీయపార్టీలతో యుద్ధం సాధ్యమేనా?’’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. జాతీయ పార్టీలే కాదు.. బరిలో చాలా పార్టీలున్నాయని సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో గానీ, కాంగ్రెస్ తో గానీ పొత్తు ఉండబోతోందా? అని ప్రశ్నించగా.. మా పొత్తు తెలంగాణ ప్రజలతోనే ఉంటుందని షాకింగ్ రిప్లే ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ లీడర్లు ప్రచారంలో దూసుకెళ్తుంటే.. టీఆర్‌ఎస్ నాయకులు చాలా ప్రశాంతంగా ఉన్నారు? అనే ప్రశ్నకు.. చిల్లరే శబ్దం చేస్తుందని బదులిచ్చారు.
వీఆర్ఏ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. రాష్ట్రంలో వీఆర్ఏల జీతాలు, పదోన్నతుల గురించి.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాననీ, వారి సమస్యలపై చర్చిస్తాననీ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఐఐటీ బాసర విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ విషయం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఐఐటీ బాసర విద్యార్థుల సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి తోపాటు వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ క్యాంపస్ లో ఉండి.. విద్యార్థులతో చర్చిస్తున్నారని, వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కేటీఆర్ సమాధానమిచ్చారు.
ప్రధాని మోదీ 3 సార్లు తెలంగాణకు వస్తే.. సీఎం కేసీఆర్ స్వాగతమే చెప్పలేదని, ఇది ప్రొటోకాల్ నిబంధన ఉల్లంఘన కాదా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. ప్రధాని వ్యక్తిగత పర్యటనకు సీఎం లు హాజరు కావాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. ప్రధాని అధికారిక హోదాలో నిర్వహించే పర్యటనలకు మాత్రమే.. సీఎంలు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రధాని తన వ్యక్తిగత పర్యటనలకు వచ్చినప్పుడు.. సీఎం వెళ్లి.. స్వాగతం పలకాల్సిన అవసరం లేదని కేటీఆర్ వెల్లడించారు. అదే సమయంలో హిందీని తమపై రుద్దడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
