JAGADISH REDDY: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఏడు నెలలుగా ఆపారని, రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపీ స్వతంత్ర వ్యవస్థను నిర్వీర్వం చేస్తుందని అన్నారు.
JAGADISH REDDY: గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మూడు బిల్లులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ బిల్లులు ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహరంపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు , మంత్రి కేటీఆర్ లు గవర్నర్ తీరుపై మండిపడిన విషయం తెలిసిందే.
తాజాగా.. మంత్రి జగదీష్ రెడ్డి కూడా గవర్నర్ తమిళసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం నాడు సూర్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆమె గవర్నరా? బిజెపి నాయకురాలా? అని ప్రశ్నించారు. బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం అమెకెక్కడిదని అన్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వ చట్టాలను నిలువరించే హక్కు ఎవరిచ్చారని నిలాదీశారు. రాజ్యాంగ మూలసూత్రాలను కాదని చట్టాలను అధిగమించమనిపిస్తే .. అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టు ధర్మసనానికే ఉందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రం తూట్లు పొడుస్తోందని విమర్శించారు.
శాసనసభలో ఒకలా... రాజ్ భవన్ లో మరోలా వ్యవహరిస్తున్నారని గవర్నర్ పై మంత్రి జగదీశ్ మండి పడ్డారు. భారత ప్రజాస్వామిక వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టని, బిజెపేతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమేనని విమర్శించారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలకు మోకాలోడ్డే ప్రయత్నమనీ, గవర్నర్ నడ్డుపెట్టి కేంద్రం ఆడుతున్న నాటకమని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపీ స్వతంత్ర వ్యవస్థను నిర్వీర్వం చేస్తుందని అన్నారు. అదే నిజం అనుకుంటే ఆ పార్టీకి అంతకు మించి నష్టం జరుగుతుందనీ, గవర్నర్ పై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు.
