ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదన్నారు బీఆర్ఎస్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డి. కవిత విచారణకు సహకరిస్తానని చెప్పినా రాత్రి వరకు విచారించడం సరికాదన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి జగదీశ్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ పరిధికి మించి మాట్లాడుతోందన్నారు. చట్ట ప్రకారం విచారణ జరగడం లేదని.. ఒక మహిళను రాత్రి వరకు విచారణ పేరుతో వుంచడమంటే వేధించడమేనని మంత్రి దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని, బీజేపీ నేతల ఆలోచనల ఆధారంగానే ఈడీ చర్యలు వున్నాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. బీజేపీ ప్రత్యర్ధి పార్టీలను వేధిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి చర్యలు ఎక్కువయ్యాయని.. కవిత విచారణకు సహకరిస్తానని చెప్పినా రాత్రి వరకు విచారించడం సరికాదన్నారు. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతామని మంత్రి స్పష్టం చేశారు. 

ఇదిలావుండగా.. తాను సుప్రీంకోర్టులో ఇవాళ ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తన పిటిషన్ ను ముందస్తుగా విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాను ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని ఆమె వివరించారు.

ALso REad: సుప్రీంకోర్టులో ముందస్తు పిటిషన్లు దాఖలు చేయలేదు: కవిత

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవాళ విచారణకు హాజరు కాలేనని చివరి నిమిషంలో ఈడీకి కవిత సమాచారం పంపడంలో వ్యూహత్మకంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మహిళలను విచారించే సమయంలో తన హక్కులను చూపి కవిత విచారణకు గైర్హాజరయ్యారు. అయితే దీనిపై స్పందించిన ఈడీ ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. తొలుత ఈ నెల 11న కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో 9 గంటలకు పైగా కవితను విచారించిన ఈడీ అధికారులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే కవిత నేడు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే తన తండ్రి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఉన్న కవిత.. విచారణకు గైర్హాజరు అయ్యారు. 

ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివవరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు.