Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ పతనానికి మునుగోడే నాంది... కేసీఆర్ వెంటే ప్రజలు : మంత్రి జగదీశ్ రెడ్డి

బీజేపీ పతనానికి మునుగోడు నాంది అయ్యిందని... ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే వున్నారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో వున్నారని ఆయన పేర్కొన్నారు. 
 

minister jagadish reddy comments after trs victory in munugode bypoll
Author
First Published Nov 6, 2022, 8:47 PM IST

మనుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన అనంతరం ఆయనకు స్వీట్ తినిపించి మంత్రి అభినందనలు తెలియజేశారు. అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మునుగోడు ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో వున్నారని అన్నారు. వచ్చే ఏడాది కాలంలో మునుగోడు అభివృద్ధికి తన వంతు బాధ్యత నెరవేరుస్తానని మంత్రి స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌కు విజయాన్ని అందించిన ప్రజలకు.. కష్టపడి పనిచేసిన శ్రేణులకు జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పతనానికి మునుగోడు నాంది అయ్యిందని... ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే వున్నారని మంత్రి పేర్కొన్నారు. అనంతరం కూసుకుంట్ల మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని.. ధర్మం గెలిచిందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చి రుణం తీర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 

అంతకుముందు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ గెలుపు కోసం పనిచేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, గులాబీ దండుకు నమస్కారాలు తెలియజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వామపక్ష పార్టీల నాయకులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. నల్గొండ గడ్డ మీద 12 సీట్లుకు 12 సీట్లు కట్టబెట్టినందుకు అక్కడి ప్రజలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 

Also REad:బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయం.. కోమటిరెడ్డికి కాంగ్రెస్ ఓట్లే : మునుగోడు ఫలితంపై కూనంనేని

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల అహంకారానికి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయని రుజువైందన్నారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు. మునుగోడులో పోటీ చేసి తెరపై కనిపించింది రాజగోపాల్ రెడ్డి అని.. వెనకుండి నడిపించింది అమిత్ షానేనని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా భారీ మెజారిటీ రావాల్సి ఉండేదని.. కానీ బీజేపీ నాయకత్వం వందల కోట్ల రూపాయలు తరలించి మునుగోడులో అసాధారణ పరిస్థితిని సృష్టించిందని విమర్శించారు. డబ్బుతో ఓటర్ల గొంతు నొక్కాలని బీజేపీ చూసిందని ఆరోపించారు. ఓటర్లకు పంచేందుకు డబ్బు తీసుకొస్తూ పలువురు బీజేపీకి చెందిన వ్యక్తులు పట్టుబడ్డారని అన్నారు. 

పార్టీ మారిన  వెంటనే రాజగోపాల్ రెడ్డి  కంపెనీ ఖాతాలోకి రూ. 75 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వాహలా ఆపరేటర్ మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి ఓటర్ల ఖాతాల్లోకి రూ. 5 కోట్లపైగా ట్రాన్స్‌ఫర్ చేశారని తాము ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షక పాత్ర వహించేటట్టు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios