కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా చెబుతుంది.. : హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా చెబుతుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా చెబుతుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో హామీలు అమలు చేయకుండా.. గెలవని తెలంగాణలో హామీలు ఇస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో సెల్ ఫోన్ ఛార్జింగ్‌కు కూడా కరెంట్ సరఫరా కావడం లేదని ఆరోపించారు. స్విచ్ వేస్తే కరెంట్ కావాలా? కటిక చీకటి కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో గెలవలేమని తెలిసి కాంగ్రెస్ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తుందని మండిపడ్డారు. ఐదు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ ఓటేయాలని.. 24 గంటలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం తెలియాలంటే కర్నాటక వెళ్లి చూసొచ్చి ఓటేయాలని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు మొత్తాన్ని ఎకరాకు క్రమంగా రూ. 16,000కు పెంచుతామని హరీష్ రావు చెప్పారు. జనవరి నుంచి అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారెంటీ అని, కాంగ్రెస్ అంటే కుమ్ములాటలకు గ్యారెంటీ అని, కాంగ్రెస్ అంటే స్కామ్‌లకు గ్యారంటీ అని, కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలకు గ్యారెంటీ అని, కాంగ్రెస్ అంటే రైతు ఆత్మహత్యలకు గ్యారెంటీ అని, కాంగ్రెస్ అంటే పేదరికానికి గ్యారెంటీ అని విమర్శించారు. అయితే వారెంటీ ముగిసిన కాంగ్రెస్ పార్టీ హామీలకు గ్యారెంటీ ఎవరని ప్రశ్నించారు.