తెలంగాణలో కేసీఆరే గ్యారంటీ, వారంటీ..: కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీల పేరిట చేపట్టిన ప్రచారంపై మంత్రి హరీష్ రావు సెటైర్లు విసిరారు.

సిద్దిపేట : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలంటూ చేస్తున్న ప్రచారంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు సెటైర్లు విసిరారు. ఇటీవల జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించారు. ఈ హామీలపై ప్రజలవద్దకు తీసువెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ గడపగడపకు వెళుతోంది. అయితే ఇలాంటి గ్యారంటీ హామీలు ఇతర రాష్ట్రాల్లో పనిచేసినా తెలంగాణ పనిచేయవని... ఇక్కడ కేసీఆర్ అనే గ్యారంటీ, వారంటీ వుందని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇస్తే మడమ తిప్పరని... ఆయనే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని హరీష్ అన్నారు. అలాంటి నాయకుడి పాలనలో ఎవరి గ్యారంటీలు పనిచేయవన్నారు. బాండు పేపర్లు, ఉత్తుత్తి హామీలు తెలంగాణలో చెల్లవని హరీష్ అన్నారు.
Read More మీకు రాజకీయాలతో సంబంధం లేదా?: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై తమిళిసై పై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో గతంలో భూములు బీడుపడితే కేసీఆర్ పాలనలో ఆకుపచ్చగా మారాయని హరీష్ అన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని హరీష్ అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏ ఊరికి పోయినా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఇలా కేసీఆర్ సుపరిపాలన అందిస్తుంటే మీ గ్యారెంటీ కార్డులు ఇంకేందుకని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.