తెలంగాణలో భారీ వర్షాలు.. హరీష్ రావు అప్రమత్తం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అప్రమత్తమయ్యారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లోనూ వరద ఉదృతి పెరుగుతూ వుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే సీజనల్ వ్యాధులు పొంచి వుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా వుండాలని.. ఏజెన్సీ ఏరియాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆేదశించారు.
మరోవైపు.. భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. గురు, శుక్రవారాలు స్కూల్లు ఉండవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నాం’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.
ALso Read: దంచి కొడుతున్న వానలు : కేటీఆర్ అప్రమత్తం, భారీ వర్షం వచ్చినా ఎదుర్కోవాలి .. అధికారులకు ఆదేశాలు
అటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ , పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమీషనర్, జోనల్ కమీషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసినా పరిస్ధితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని ఆదేశించారు.
వచ్చే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని.. భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కేటీఆర్ సూచించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని.. ప్రాణనష్టానికి అవకాశం ఇవ్వొదని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లో వరదలు, పారిశుద్ధ్యంపైనా మంత్రి కేటీఆర్ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.