Nizamabad Hospital: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై  మంత్రి హరీష్ రావు స్పందించారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Nizamabad Hospital: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రెచర్ లేక రోగిని కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈను మంత్రి హరీశ్ ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవటంతో రోగిని కాళ్లు పట్టుకొని లిఫ్టు వరకు రోగి బంధువులు లాకెళ్లారు. ఈ సమయంలో ఆస్పత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదు. ఈ ఘటన ఏప్రిల్ 1న జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

కలెక్టర్ సీరియస్ 

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటన సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అసలేం జరిగిందో విచారణ చేసి.. వెంటనే నివేదిక అందజేయవల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. సూపరింటెండెంట్ వివరణ, ఘటనపై ఉన్నతస్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. 

ఆసుపత్రి పై దుష్ప్రచారం : సూపరింటెండెంట్ 

ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ స్పందించారు. ఆసుపత్రి పై నమ్మకం పోగేట్టేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి చేయడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన‌కు ప్రభుత్వ ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.. పేషెంట్ కేర్ సిబ్బంది రోగిని వీల్ చైర్‌లో కూర్చోబెట్టారనీ, ఓపి చిట్టీ తీసుకుని వచ్చే‌లోపు లిఫ్ట్ వచ్చిందని తల్లిదండ్రులు ఆ రోగిని లాక్కెళ్లారని తెలిపారు. 2వ అంతస్థు చేరుకున్న పేషెంట్‌ను వీల్ చైర్‌లో వైద్యుని వద్దకు తీసుకెళ్లారనీ, ఈ విషయం తెలియని వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి .. సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ తెలిపారు.