ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం ఎదురుచూస్తున్న పేద యువతికి ఉచితంగానే వైద్యం అందించేందుకు ముందుకొచ్చి గొప్ప మనసు చాటుకున్నారు మంత్రి హరీష్ రావు. 

హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న నిరుపేద కుంటుంబానికి చెందిన యువతికి పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. యువతిని వెంటనే నిమ్స్ హాస్పటల్ కు తరలించి మెరుగైన చికిత్స అందించాలంటూ మంత్రి ఆదేశించారు. ఇలా తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు చొరవ తీసుకున్న మంత్రికి ఆ తల్లి కృతజ్ఞతలు తెలిపింది. 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోకి కంగ్టి గ్రామానికి చెందిన మాణిక్ గొండ-చంద్రమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతారం. పన్నెండేళ్ల క్రితమే భర్త చనిపిపోవడంతో అన్నీ తానే అయి బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా పెంచుకుంది చంద్రమ్మ. కూలీ పనులు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది చంద్రమ్మ. ప్రస్తుతం చిన్నకూతురు సురేఖ(20) తో కలిసి ఓ అద్దె ఇంట్లో వుంటోంది చంద్రమ్మ. 

Read More ఈ నాలుగేళ్లూ ఏం చేశారు.. ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత హడావుడా : మోడీ పర్యటనపై హరీశ్ రావు చురకలు

అయితే ఇటీవల ఇంటిపనులు చేస్తుండగా సురేఖ ఉన్నట్టుండి కిందపడిపోయింది. దీంతో కంగారుపడిపోయి తల్లి నిజామాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తరలించగా పలు టెస్టులు చేసిన డాక్టర్లు సురేఖ తలలో ట్యూమర్ వుందని చెప్పారు. ఇప్పటికే చీము నిండిపోయి ప్రమాదకరస్థితికి ట్యూమర్ చేరుకుందని... నాలుగురోజుల్లో ఆపరేషన్ చేయాల్సి వుంటుందని చెప్పారు. ఈ ఆపరేషన్ కు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని... ఎప్పుడు డబ్బులు కడితే అప్పుడు ఆపరేషన్ చేద్దామని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేదు... అమ్ముదామంటే ఆస్తిపాస్తులు లేవు... కేవలం రెక్కల కష్టంతో బ్రతుకుతున్న ఆ తల్లి బిడ్డ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలీక కన్నీరుమున్నీయ్యింది. 

చివరకు తన కూతురు ప్రాణాలు కాపాడేందుకు మానవతా దృక్ఫథంతో ఆర్థిక సాయం చేయాలని చంద్రమ్మ దాతలను కోరింది. సాయం చేయాలనుకున్న వారు ఫోన్ పే నంబర్ కు డబ్బులు పంపాలంటూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వేడుకుంది. 

అయితే ఎలాగో రేణుక ఆరోగ్యపరిస్థితి గురించి మంత్రి హరీష్ రావు తెలియడంతో వెంటనే స్పందించారు. ఆ నిరుపేద కుటుంబానికి భరోసా ఇస్తూ పూర్తి ఉచితంగా ప్రభుత్వం తరపున వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు. దీంతో బిడ్డ ప్రాణాలు దక్కవేమోనని తల్లడిల్లిన తల్లి మంత్రికి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.