ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత చేస్తే, తమ ప్రభుత్వం ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయ కొట్టిందన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ అగ్రనేత , మంత్రి హరీశ్ రావు. ప్రధాని మోడీ ఏప్రిల్ 8న తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఎయిమ్స్‌లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజ్ వస్తే మోడీ ఇప్పుడు కొబ్బరికాయ కొడతారా అంటూ హరీశ్ రావు చురకలంటించారు. మోడీ వస్తున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత చేస్తే, తమ ప్రభుత్వం ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయ కొట్టిందన్నారు. బీజేపీది పని తక్కువ, ప్రచారం ఎక్కువన్నారు. తమది చేతల ప్రభుత్వమని.. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో చేయని పనులను కేసీఆర్ 8 ఏళ్లలోనే పూర్తి చేశారని హరీశ్ రావు ప్రశంసించారు.
ఇదిలావుండగా.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో విద్యార్థుల సమస్య కాస్త బిఆర్ఎస్ వర్సెస్ బిజెపిగా మారింది. టెన్త్ ప్రశ్నపత్రాలతో పాటు ఇటీవల టీఎస్ పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ కూడా బిజెపి పనేనని బిఆర్ఎస్... తమ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ సర్కార్ తమను బద్నాం చేస్తోందని బిజెపి అంటోంది. ఈ పేపర్ల లీకేజీపై ఇరు పార్టీల నాయకులు మీడియాముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
Also Read: బండి సంజయ్ రిమాండ్ రద్దు: హైకోర్టులో కీలక వాదనలు, విచారణ ఈ నెల 10కి వాయిదా
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ టెన్త్ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ, బండి సంజయ్ అరెస్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న పేపర్ల లీకేజీలు ముమ్మాటికీ బీజేపీ పనేనని మంత్రి ఆరోపించారు. ఈ లీకేజీ వెనక "నమో" కుట్రలు వున్నాయన్నారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడు కాగా ఏ2 గా ఉన్న ప్రశాంత్ బీజేపీ సంస్థ "నమో" పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ అని మంత్రి పేర్కొన్నారు. వీరిద్దరు కలిసి పథకం ప్రకారమే పేపర్ల లీకేజీకి కుట్రలు పన్ని నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు.
బండి సంజయ్ నిజంగానే నిజాయితీపరుడైతే... పేపర్ల లీకేజీలో అతడి హస్తం లేకుంటే పోలీసులకు తన మొబైల్ ఫోన్ ఎందుకు ఇవ్వడంలేదు? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఆ ఫోన్ పోలీసుల చేతిలో పడితే పేపర్ల లీకేజీలతో కేంద్రంలోని బిజెపి పాత్ర బయటపడుతుందని... అందువల్లే సంజయ్ ఫోన్ ఇవ్వడంలేదని మంత్రి అన్నారు. పథకం ప్రకారమే కేంద్రం, రాష్ట్ర బిజెపి నాయకులు పేపర్లను లీక్ చేసి తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు పన్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.
