సారాంశం

కేసీఆర్ బిక్ష వల్లే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవులు దక్కాయన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్, బీజేపీలు ప్రకృతి వైపరీత్యాల కన్నా దారుణంగా తయారయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 100 పడకల నూతన ప్రభుత్వాసుపత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావు ప్రసంగిస్తూ.. కేసీఆర్ బిక్షతోనే రేవంత్, బండి సంజయ్‌లకు పార్టీ అధ్యక్ష పదవులు దక్కాయన్నారు. బట్టకాల్చి మీద వేయడం, గోబెల్స్ ప్రచారం చేయడమే రేవంత్ పని అంటూ దుయ్యబట్టారు. గతంలో కొడంగల్ ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఆయన ఒక్క ఆసుపత్రిని కూడా తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ గనుక అధికారంలో వుండి వుంటే మరో 20 ఏళ్లు అయినా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా వచ్చి వుండేది కాని హరీశ్ చురకలంటించారు. 

ALso Read: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఓ బ్రోకర్..: రేవంత్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

కాంగ్రెస్ పాలనలో పాలమూరును కరువు , కాటకాలు, వలసలు పట్టిపీడించాయన్నారు. అప్పుడు మంత్రిగా వున్న లక్ష్మారెడ్డి కొడంగల్‌కు వంద పడకల ఆసుపత్రిని ఇచ్చారని హరీశ్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రకృతి వైపరీత్యాల కన్నా దారుణంగా తయారయ్యాయని.. చెడగొట్టే పనులు తప్పించి మంచి పనులు మాత్రం చేయవని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 50 స్థానాల్లో అభ్యర్ధులే లేరని.. కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని హరీశ్ సెటైర్లు వేశారు. 

60 ఏళ్లలో జరగని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలో చేసి చూపిందన్నారు. గతంలో పాలమూరు నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందినవారు తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నారని హరీశ్ రావు వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. దళిత, రైతు బంధును వదులుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.