ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. విభజన వ్యతిరేకించి తాను తప్పు చేశానని స్వయంగా లగడపాటి రాజగోపాల్ చెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. శనివారం సంగారెడ్డిలో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు నేతల వాళ్ల ఏపీ ప్రస్తుతం బొక్కబోర్లా పడిందన్నారు. గతంలో ఒకరు హైటెక్ పాలన , అడ్మినిస్ట్రేషన్ అంటూ హడావుడి చేశారని.. మరి ఇప్పుడేమైందని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల నిధులను విడుదల చేయడం లేదని హరీశ్ రావు విమర్శించారు.
తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని.. అంతా చీకటేనని గతంలో కొందరు చెప్పారని కానీ గడిచిన 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ రుజువు చేశారని ప్రశంసించారు. తెలంగాణకు కేంద్రమే అవార్డులు ఇస్తోందని.. విభజన వ్యతిరేకించి తాను తప్పు చేశానని స్వయంగా లగడపాటి రాజగోపాల్ చెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు. ధరణి తీసేస్తే కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు ఇష్తారని.. మళ్లీ దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందన్నారు.
ALso Read: మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డే అంటారా..!: బండి సంజయ్ కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్
ఇక నిన్న హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తే ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయకు బిజెపి ఎంపీ బండి సంజయ్ ధన్యవాదాలు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చుచేస్తోందని... అలాంటిది కేంద్రమే వీటిని ఏర్పాటు చేస్తోందంటూ బిజెపి ప్రచారం దుర్మార్గమని అన్నారు. చివరకు మందికి పుట్టిన బిడ్డ తమదే అనేలా బిజెపి తయారయ్యిందని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో జరిగిన సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్.
ఈ క్రమంలోనే తెలంగాణలో మెడికల్ కాలేజీల అనుమతులపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు హరీష్ ఘాటుగా కౌంటరిచ్చారు. నేషనల్ మెడికల్ కమీషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని... అన్నీ సరిగ్గా వున్నాయో లేదో పరిశీలించి మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీలను కూడా పరిశీలించి అన్ని బాగున్నాయని నిర్దారించుకుని అనుమతి ఇచ్చిందన్నారు. ఇలా తెలంగాణలో 9 ప్రభుత్వ కాలేజీలకు, 4 ప్రైవేట్ కాలేజీలకు ఎన్ఎంసి అనుమతులు ఇచ్చిందన్నారు. కానీ బిజెపి నాయకులు తెలంగాణలో మెడికల్ కాలేజీలను కేంద్రమే ఏర్పాటుచేసింది అనేలా డబ్బా కొడుతూ ప్రచారం చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు.
