ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. ఆదివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని.. ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని కేంద్రం రాజకీయాలు చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీగా వున్న అంగన్‌వాడీ పోస్ట్‌లను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంగన్‌వాడీ పోస్ట్‌లు ఖాళీగా వున్నాయని అన్నారు. అలాగే 1500 ఆశా వర్కర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని హరీశ్ రావు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానాల్లో నిరుపేదలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. అక్కడ ప్రస్తుతం 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని.. వీటి సంఖ్యను త్వరలోనే 134కు పెంచుతామని హరీశ్ రావు వెల్లడించారు. 

ALso Read; ఇదీ దేశంలో పరిస్దితి..అబద్ధమైతే రాజీనామా చేస్తా : అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సవాల్

ఇకపోతే.. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు కొత్త చట్టం తెస్తామన్నారు హరీశ్ రావు. శనివారం ఆసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటి వరకు నియంత్రణ లేదన్నారు. అందుకే కొత్త చట్టం తెస్తామని హరీశ్ రావు తెలిపారు. పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. జిల్లాకొక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని.. దీని వల్ల ప్రొఫెసర్లు, 650 పడకల ఆసుపత్రి వస్తుందని , ఆపరేషన్ థియేటర్లు వస్తాయని తెలిపారు. దీని వల్ల ప్రజలకు వారి జిల్లాలోనే కార్పోరేట్ వైద్యం అందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని .. ఇవన్నీ 4,200 పడకలతో వస్తున్నాని హరీశ్ రావు చెప్పారు. నిమ్స్‌లో 2 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వుందని తెలిపారు. 

అంతకుముందు అంతర్రాష్ట్ర జల వివాదాలే ఏడాదిలో పరిష్కరించాలని , లేనిపక్షంలో .. ట్రిబ్యునల్ వేయాలని చట్టంలో వుందన్నారు హరీశ్ రావు. కేంద్రం మాటనమ్మి సుప్రీంకోర్టులో కేసు వేసినా విత్ డ్రా చేసుకున్నామని.. 9 ఏళ్లుగా బీజేపీ కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చలేదన్నారు. నీటి కేటాయింపుల్లో కర్ణాటకకు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. నీటి వాటాపై అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని.. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారని, సభలో ఒక్కరు కూడా లేరని హరీశ్ రావు చురకలంటించారు. సభ కంటే వారికి బయటి రాజకీయాలే ఎక్కువని హరీశ్ దుయ్యబట్టారు. కాళేశ్వరం మీద 300 కేసులు వేసినా ఆగలేదని.. పాలమూరు కూడా అంతే వేగంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణకు ఇబ్బంది వుందని.. బ్యాక్ వాటర్ స్టడీ కోసం సీడబ్ల్యూసీ కమిటీ వేసిందని హరీశ్ రావు తెలిపారు.