తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ.. ప్రగతిని అడ్డుకుంటున్నారు.. : గవర్నర్ పై హరీశ్ రావు విమర్శలు
Hyderabad: గవర్నర్ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చుతున్నారనీ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. గవర్నర్ వైఖరిని చాలా విషయాల్లో సందేహాస్పదంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆమె పట్ల అత్యంత సంయమనం పాటిస్తున్నదని మంత్రి అన్నారు.
Telangana Finance Minister T Harish Rao: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీరుపై మండిపడ్డారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించడం గురించి ప్రస్తావిస్తూ.. సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారనీ, కీలక బిల్లులను అడ్డుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మంత్రి ఆరోపించారు. గవర్నర్ వైఖరిని చాలా విషయాల్లో సందేహాస్పదంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆమె పట్ల అత్యంత సంయమనం పాటిస్తున్నదని మంత్రి అన్నారు. మహిళగా, రాష్ట్ర గవర్నర్ గా ప్రభుత్వం తమిళిసైని గౌరవిస్తున్నదని పేర్కొన్నారు.
మీడియాకు ఇచ్చిన అనధికారిక చిట్ చాట్ లో మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి చర్యల అవసరం ఉందని, ఇలాంటి సందర్భాల్లో గవర్నర్ హాజరుకావాలని కోరడం రాజ్యాంగం ప్రకారం ఉందా? అని ప్రశ్నించారు. గవర్నర్ పై రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం ఉందని స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసే సమయంలో రాష్ట్రపతిని ప్రధాని ఆహ్వానించారా? అని ప్రశ్నించారు. వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించే సమయంలో రాష్ట్రపతిని ఆహ్వానించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన బిల్లులపై గవర్నర్ వైఖరిని ప్రశ్నించిన హరీష్ రావు.. భద్రాచలం విలీన గ్రామాల బిల్లును గవర్నర్ ఆపారని తెలిపారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమె అడ్డుకున్నారని పేర్కొన్నారు. కీలక బిల్లులను అడ్డుకుంటూ గవర్నర్ రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు.
నగరంలో జీ20 సదస్సులకు సంబంధించిన వేదికల్లో గవర్నర్ ప్రసంగం హైదరాబాద్ ప్రాముఖ్యతను, పరిధిని మరింత పెంచుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.. కానీ దురదృష్టవశాత్తూ ఆమె స్వరం మరోలా ఉందనీ, గవర్నర్ పదవిని కించపరిచే విధంగా ఆమె మాట్లాడారన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో సాధించిన పురోగతికి ముగ్ధుడైన నటుడు రజినీకాంత్ హైదరాబాద్ గురించి గొప్పగా మాట్లాడారు. రాష్ట్ర ప్రగతిపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడారని చెప్పారు. హైదరాబాద్ గురించి రజినీకాంత్ కు తెలిసిన వాస్తవాలు గవర్నర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. గవర్నర్ కు రాజకీయాలపై అంత వ్యామోహం ఉంటే మళ్లీ బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించి ఎన్నికల రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజల మనిషి అనీ, గవర్నర్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని, అనేక అంశాల్లో ఆమె వైఖరి ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఆమె పట్ల అత్యంత సంయమనం ప్రదర్శిస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు.