ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించి బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన గవర్నర్ తమిళిసై కి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు బిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. రాజ్యాంగబద్ద పదవిలో వున్న తమిళిసై బిజెపి నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గవర్నర్ కూడా కేసీఆర్ సర్కార్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా హాస్పిటల్ విషయంతో గవర్నర్ తమిళిసై కి తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు మధ్య మాటలయుద్దం సాగుతోంది.
ఇటీవల హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితిపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేసారు. తాజాగా గవర్నరే స్వయంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పరిస్థితులను పరిశీలించారు. ఆకస్మికంగా హాస్పిటల్ ను సందర్శించిన తమిళిసై వైద్యసదుపాయాలపై రోగులు, డాక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని కోరిన తనను ప్రశ్నించే బదులు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిదంటూ హరీష్ రావుకు చురకలు అటించారు. ఉస్మానియా హాస్పిటల్ తనిఖీ వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని... ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని అన్నారు.
ఉస్మానియా హాస్పిటల్ సందర్శన సందర్భంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసదుపాయాలు మెరుగుపడ్డాయని అన్నారు. కొందరు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని... చెవులుండీ మంచి వినలేని, నోరుండి మంచి మాటలు మాట్లాడలేని పరిస్థితిలో వున్నారంటూ పరోక్షంగా గవర్నర్ తమిళిసైకి చురకలు అంటించారు.
Read More లీగల్ సమస్యతో ఉస్మానియాకు కొత్త భవనం నిర్మాణాన్ని తప్పించుకొనే యత్నం: కేసీఆర్ సర్కార్ పై తమిళిసై
రాజ్యాంగ పదవిలో వున్నవారు బాధ్యతాయుతంగా వుండాలని... రాజకీయ పార్టీ నాయకుల్లాగా వ్యవహరించడం తగదని హరీష్ సూచించారు. తెలంగాణ ఏర్పాటుతర్వాతే నిమ్స్ హాస్పిటల్లో వైద్యంకోసం వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయన్నారు. ఇప్పటికే నిమ్స్ ప్రాంగణంలో అత్యాధునికి సదుపాయలతో అద్భుతమైన హాస్పిటల్ రూపుద్దిద్దుకోనుందని హరీష్ పేర్కొన్నారు.
ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణానికి లీగల్ సమస్యలు ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. కొత్త భవనం నిర్మాణానికి సంబంధించి ఏకాభిప్రాయం అవసరం ఉందని... ఇలా సేకరించి నివేదికను హైకోర్టుకు అందిస్తామని అన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు రాగానే కొత్త భవనం నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి హరీష్ తెలిపారు.
