ఏపీలో అధికార పక్షం అడగదు.. ప్రతిపక్షం ప్రశ్నించదు.. మా జోలికి రావొద్దు: కారుమూరి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏపీ కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏపీ కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు ఈరోజు సంగారెడ్డిలోని జోగిపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలతో తానెదో మాట వరుసకు మాట్లాడితే ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. వాళ్లు ఇక్కడే ఉంటామని ఓటు కూడా రాయించుకున్నామని చెప్పారని.. అయితే రెండు ఓట్లు ఉన్నవాళ్లు ఇక్కడ సౌలత్ ఉంటే ఇటే ఓటు ఉంచుకోవాలని తాను ఓ మాట అన్నానని తెలిపారు. తెలంగాణలో ఏముందని ఓ ఏపీ మంత్రి అంటున్నారని.. ఏముందో వచ్చి చూస్తే తెలుస్తుందని చెప్పారు.
తమ రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత్ విద్యుత్ ఉందని తెలిపారు. తెలంగాణ కల్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామని.. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఇలా అనేకం చెబుతానని అన్నారు.
ఆనాడూ వైసీపీ ప్రత్యేక హోదా కావాలని అడిగిందని.. ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడరని అన్నారు. విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందని విమర్శించారు. అధికార పక్షం ఉన్నవాళ్లు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రశ్నించరని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ(టీడీపీ) ఆనాడూ ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని.. ఇప్పుడు అదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాపకం కోసం పాకులాడుతుందని విమర్శించారు. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని వైసీపీ, టీడీపీలను విమర్శించారు. వైసీపీ, టీడీపీలు ఏపీని ఆగం చేశాయని.. అనవసరంగా తమ జోలికి రావొద్దని.. అది మీకే మంచిది కాదని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, హరీష్ రావు మంగళవారం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికులు ఇక్కడే (తెలంగాణలో) వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ఏపీ, తెలంగాణకు భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని కూడా అన్నారు. ‘‘ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ బాగా తెలుసు’’ అని కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు కాకుండా కేవలం తెలంగాణలోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు.
అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఒకసారి ఏపీలోకి వచ్చి చూస్తే.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ఏపీ ప్రజలు మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ముందుగా సమాధానాలు చెప్పుకోండి అంటూ విమర్శించారు.