సిద్దిపేట: కరోనా మహమ్మారి బారిన పడకుండా వుండాలంటే అన్నివేళలా గోరువెచ్చని నీరు తాగాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించారు. అలాగే వేడి నీటిలో పసుపు, మిరియాలు వేసుకుని ఆవిరి పట్టుకోవాలని సూచించారు. ఇక నిమ్మరసం కూడా ఎక్కువగా తాగాలన్నారు. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూనే భౌతిక దూరం, మాస్కులు ధరిస్తే కరోనా నుండి మనల్ని మన కాపాడుకున్న వారిమి అవుతామని మంత్రి అన్నారు. 

ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది కావున అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. వైరస్ సోకకుండా మనజాగ్రత్తలో మనం వుండాలన్నారు. ఎవరికైనా వైరస్ సోకినట్లు తెలిసినా సూటిపోటిమాటలతో వారిని మానసికంగా బాధపెట్టరాదని... వారు తొందరగా కోలుకునేలా దైర్యం చెప్పాలని హరీష్ రావు సూచించారు. 

read more   దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

గురువారం సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో సిసి రోడ్ల పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని... అలాగని భయపడవద్దని సూచించారు. మన జాగ్రత్తలో మనం వుంటూనే రోజువారి పనులు చేసుకోవచ్చిన అన్నారు.  

ఈ నెలలోనే సిద్దిపేటలో కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లా ప్రజల సౌకర్యార్థం వంద మందికి సేవలందించేలా కొవిడ్‌ ఆసుప్రతి ఏర్పాటు చేస్తున్నట్లు... అందులో 20 పడకలతో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు.