విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే ఏపీలోని రెండు పార్టీలు నోరుమూసుకున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు. కానీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు, కార్మికులు దీనికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారని ఆయన అన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు. గురువారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా ఏపీలోని రెండు పార్టీలు నోరు మూసుకున్నాయని వ్యాఖ్యానించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు, కార్మికులు దీనికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారని హరీశ్ అన్నారు. విశాఖ ఉక్కును బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని మంత్రి తెలిపారు. 27 వేల మంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల పక్షాన కేసీఆర్ నిలిచారని హరీశ్ రావు వెల్లడించారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మడం లేదన్న కేంద్రం ప్రకటన బీఆర్ఎస్ పార్టీ విజయమని హరీశ్ రావు పేర్కొన్నారు. 

అంతకుముందు ఇదే విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తమ వల్లే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందన్నారు. తమతో పెట్టుకుంటే అట్లుంటదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందున్నారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం ఒక ప్రకటన చేసిందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దెబ్బంటే అలా వుంటుందని మంత్రి అన్నారు. 

ALso Read: ఉట్టికి ఎగురలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుంది:విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ కు పేర్నినాని కౌంటర్

కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ చెప్పారు. గురువారంనాడు ఫగ్గన్ సింగ్ విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ విషయమై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఈఓఐలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడగా కేంద్ర మంత్రి మంత్రి అభిప్రాయపడ్డారు.