తన్నీరు.. ఈ పేరులోనే ఉంది.. కన్నీరు తుడిచే గుణం.  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఓ అభాగ్యురాలిని అన్నీతానై ఆదరించారు. తండ్రిలా చదివించి పెద్ద చేశారు. అన్నలా ఆమె అభీష్టం మేరకు నచ్చిన వాడికి ఇచ్చి వివాహం జరిపించి గొప్ప మనసు చాటుకున్నారు.

చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లికి చెందిన భాగ్య 2018లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలింది. దిన పత్రికల్లో ఆమె ధీనావస్థపై వచ్చిన కథనాన్ని చూసి స్పందించిన మంత్రి హరీశ్ రావు వెంటనే కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో మాట్లాడి భాగ్య సంరక్షణ బాధ్యతలు చూడాలని సూచించారు.

మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనంలో ఆమెకు వసతి కల్పించారు. చదువు పూర్తయిన తరువాత బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగం కల్పించారు.

నచ్చిన వాడికి ఇచ్చి గురువారం ఆమెకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్‌కు చెందిన రాజుతో సిద్దిపేటలోని టీటీడీ భవనంలో భాగ్య వివాహం జరిగింది.

మంత్రి హరీశ్ రావు, కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్ రెడ్డి, ఇతర అధికారులంతా పెళ్లికి పెద్దలుగా వ్యవహరించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాల సదనంలోని చిన్నారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది వివాహ వేడుకలో పాల్గొని సందడి చేశారు.