ఖమ్మం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ తొలి సభ జరగనుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాల్ని మలుపు తిప్పుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ తొలి సభ జరగనుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాల్ని మలుపు తిప్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఖమ్మం.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో నలుగురు సీఎంల పాల్గొననున్నారని చెప్పారు. కేసీఆర్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్ హాజరుకానున్నట్టుగా చెప్పారు.
ఒకప్పుడు ఖమ్మంకు.. ఇప్పటి ఖమ్మంకు చాలా తేడా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం దశదిశ మారిపోయిందని చెప్పారు. ఖమ్మం వచ్చినప్పుడల్లా తాను కొన్ని నేర్చుకుని పోతానని అన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని విమర్శించారు. బీజేపీలో చేరేవాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్టేనని అన్నారు. మతతత్వ పార్టీలకు ఖమ్మంలో ఓట్లు పడవని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానమే లేదన్నారు.
100 ఎకరాల స్థలంలో సభ జరగనుందని హరీష్ రావు చెప్పారు. పార్కింగ్ కోసం 448 ఎకరాలు కేటాయించినట్టుగా తెలిపారు. 20 పార్కింగ్ స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలిపారు.
