కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. విదేశీయులను చూడటానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి ఏమైందని భట్టి నిలదీశారు. దీనికి మంత్రి కౌంటరిచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి హరీశ్ రావుకు మధ్య మాటల యుద్ధం నడిచింది. తొలుత భట్టి మాట్లాడుతూ.. తమకు మైకులు కట్ చేసి వాళ్లకు మాత్రమే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్లుగా వుందని భట్టి దుయ్యబట్టారు. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. దేశ విదేశాల నుంచి వచ్చి చూశారని అంటున్నారని.. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ, నీళ్లు ఇవ్వలేపదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. పంపులు మునిగిపోయాయని చూద్దామంటూ పోనివ్వరని.. విదేశీ వాళ్లకు అనుమతి ఇస్తారు కానీ మాకు అనుమతివ్వరని భట్టి ఎద్దేవా చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక.. పాలమూరు-రంగారెడ్డి ఒక్కటే మొదలుపెట్టారని విక్రమార్క దుయ్యబట్టారు. తాము కట్టిన ప్రాజెక్ట్‌ల వల్లే నీళ్లు వచ్చాయని.. పారుతున్నవీ అవేనని భట్టి అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఎంత వరకూ వచ్చాయని విక్రమార్క ప్రశ్నించారు.
దీనకి హరీశ్ రావు కౌంటరిచ్చారు.రేపు కాళేశ్వరానికి వెళ్తామంటే .. అధికారులు వెంట వుండి చూపిస్తారని అన్నారు. మీరు వెళ్తా అనే రోజు.. గోదావరికి భారీ వరద వచ్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదని మంత్రి తెలిపారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారని ఆయన చురకలంటించారు. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందని.. నయా పైసా ఖర్చు లేకుండా ఏజెన్సీ నుంచే రిపేర్ చేయించామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు బిడ్డలు ఎందుకు వలస పోయారని హరీశ్ ప్రశ్నించారు.
Also REad: మంత్రి కేటీఆర్‌తో కాంగ్రెస్ నేతలు భట్టి, వీహెచ్ భేటీ..
ఏడు లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని.. పాలమూరు గోస తీర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. తాము వచ్చాక 3,600 కోట్లు ఖర్చు పెట్టి 5 లక్షల ఎకరాలకు నీరిచ్చామని హరీశ్ వెల్లడించారు. చంద్రబాబు ప్రారంభించుడు.. వైఎస్ మొక్కలు నాటుడే కదా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందని మంత్రి సెటైర్లు వేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయని.. ట్రిబ్యునల్‌లో పోరాడి రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేసేలా చేశామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. గతేడాది ఫిబ్రవరి 13న పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను ఇచ్చామని ఆయన తెలిపారు. నదీ జలాల వివాదంలో గట్టిగా కొట్లాడతామన్నారు.
దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. అవకతవకలు జరగలేదని అంటున్నారని, మళ్లీ మీరెందుకు అదే మాట అంటారని ప్రశ్నించారు. అలా మీరెలా చెబుతారు సార్ అని భట్టి విక్రమార్క అన్నారు. అయితే దీనికి తాను ఎవిడెన్స్ అని స్పీకర్ పేర్కొన్నారు. కడెం ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా లేదని.. అలాగే మూసి ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌ల నిర్వహణ సరిగాలేదని భట్టి విమర్శించారు. డీపీఆర్ ఇస్తే పనులు ఎందుకు త్వరగా జరగడం లేదని విక్రమార్క ప్రశ్నించారు.
