దోచుకోవడానికి వస్తున్నారు.. ఈ ఎన్నికలు ఆంధ్రావాళ్లకి , మనకి జరిగే యుద్ధం : గంగుల కమలాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఆంధ్రావాళ్లు, ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
తెలంగాణ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఆంధ్రావాళ్లు, ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తాను చేసిన అభివృద్ధి పనులు చూసి తనకు ఓటేయ్యాలని గంగుల కోరారు.
ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌పైనా మంత్రి విమర్శలు గుప్పించారు. సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు చేసిందేమీ లేదని.. ఒక్క రోజు కూడా గ్రామాల వంక చూడలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగలకు ఓటు వేసి దానిని వృథా చేసుకోవద్దని, కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితంగా వుంటుందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులతో జాగ్రత్తగా వుండాలని ఆయన హెచ్చరించారు.
కాగా.. ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. బండికి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కూడా బలమైన నేతలను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ తరపున పురుమళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
ప్రతి నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపొటములను ఓ వర్గం శాసిస్తున్నట్లే కరీంనగర్‌లోనూ .. అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించేది రెండు వర్గాలు. ఒకరు మున్నూరు కాపులైతే.. రెండోది ముస్లింలు. తొలుత ఈ ప్రాంతంలో వెలమ సామాజిక వర్గం బలంగా వున్నప్పటికీ.. రాను రాను ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం పుంజుకుంది. కరీంనగర్‌లో మొత్తం ఓటర్లు 3,40,520 మంది. వీరిలో మున్నూరు కాపులు 60,892.. ముస్లింలు 68,952.. వెలమలు 39,785.. రెడ్లు 21,985 మంది ఓటర్లున్నారు.
గంగుల కమలాకర్ నాలుగో సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు గెలిచిన హ్యాట్రిక్ కొట్టిన గంగుల.. నాలుగోసారి విజయం సాధించాలని భావిస్తున్నారు. మానేరు రివర్ ఫ్రంట్, మెడికల్ కాలేజ్, టీటీడీ దేవాలయం, ఇస్కాన్ టెంపుల్ వంటివి పూర్తి చేయడంలో తాను కీలకపాత్ర పోషించానని మంత్రి చెబుతున్నారు. ఎంపీగా వున్నప్పటికీ బండి సంజయ్ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయలేదని గంగుల ఆరోపిస్తున్నారు.