వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచులు సరిపడా అందుబాటులో వున్నాయన్నారు. అందుచేత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను గంగుల ఆదేశించారు.
గతేడాదితో పోలిస్తే దాదాపు 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని... ఈరోజు వరకు 1,32,989 మంది రైతుల నుంచి 8.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని కమలాకర్ పేర్కొన్నారు. వర్షాకాలానికి సంబంధించి ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ధాన్యం సేకరణ జరుగుతుందని... దీనికి అనుగుణంగా ఇప్పటి వరకు 4,579 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతాంగానికి ఆయన సూచించారు.
ALso REad:తెలంగాణ రైతాంగానికి శుభవార్త.. డిసెంబర్‌లోనే రైతుబంధు : మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన
ఇకపోతే.. తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌లో రెండో పంట సాగుకు డిసెంబర్‌లోనే రైతు బంధు సాయం అందజేస్తామని ప్రకటించారు. రైతు బంధు సాయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఆదేశాలు జారీ చేయగా.. ఆర్ధిక శాఖ ఆమోదించిందని చెప్పారు.
రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని.. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఐకేపీ, పీఏసీసీఎస్, ఏఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల్లోనే మద్ధతు ధర లభిస్తుందని.. దళారుల మాటను నమ్మొద్దని మంత్రి సూచించారు. వనపర్తి జిల్లాలో 1,82,963 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 5.24 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యాసంగి సాగుకు నీరు పుష్కలంగా అందుబాటులో వుందని.. వరితో పాటు నూనె, పప్పు దినుసులు వంటి పంటలను కూడా పండించాలని నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు.
