Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రైతాంగానికి శుభవార్త.. డిసెంబర్‌లోనే రైతుబంధు : మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన

యాసంగి సీజన్‌లో రెండో పంట సాగుకు డిసెంబర్‌లోనే రైతు బంధు సాయం అందజేస్తామని ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి . యాసంగి సాగుకు నీరు పుష్కలంగా అందుబాటులో వుందన్నారు. 

telangana agriculture minister niranjan reddy key announcement on rythu bandhu
Author
First Published Nov 12, 2022, 9:08 PM IST

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌లో రెండో పంట సాగుకు డిసెంబర్‌లోనే రైతు బంధు సాయం అందజేస్తామని ప్రకటించారు. శనివారం వనపర్తిలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు సాయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఆదేశాలు జారీ చేయగా.. ఆర్ధిక శాఖ ఆమోదించిందని చెప్పారు. 

రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని.. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఐకేపీ, పీఏసీసీఎస్, ఏఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల్లోనే మద్ధతు ధర లభిస్తుందని.. దళారుల మాటను నమ్మొద్దని మంత్రి సూచించారు. వనపర్తి జిల్లాలో 1,82,963 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 5.24 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యాసంగి సాగుకు నీరు పుష్కలంగా అందుబాటులో వుందని.. వరితో పాటు నూనె, పప్పు దినుసులు వంటి పంటలను కూడా పండించాలని నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు. 

కాగా.. తెలంగాణలో మొదటిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతుల కోసం రెండు ముఖ్యపథకాలు తీసుకొచ్చింది. అందులో ఒక‌టి రైతుబంధు కాగా మ‌రొక‌టి రైతుబీమా. ఈ రెండు ప‌థ‌కాల‌ను రైతులను విశేషంగా ఆక‌ర్షించాయి. గ‌తంలో ఉన్న ఏ ప్ర‌భుత్వాలు ఇలాంటి ప‌థ‌కాలు తీసుకురాక‌పోవ‌డంతో సీఎం కేసీఆర్ ఈ రెండు ప‌థ‌కాల‌తో రైతుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప‌ట్ట‌దారు పాసు పుస్త‌కం ఉన్న రైతు చ‌నిపోతే ఏ కార‌ణంతో చ‌నిపోయినా కుటంబానికి రూ.5 ల‌క్ష‌ల బీమా అందించ‌డం రైతు బీమా ప‌థ‌కం ఉద్దేశ‌మైతే, పంట పెట్టుబ‌డికి కావాల్సిన ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూర్చ‌డం రైతుబంధు ప‌థ‌కం ఉద్దేశం. 

ప్ర‌తీ ఏటా రెండు విడ‌త‌లుగా అంటే వానాకాలం సీజ‌న్‌కు ముందు, యాసంగి సీజ‌న్‌కు ముందు ఎక‌రానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబ‌డికి ప్ర‌భుత్వం సాయంగా అందిస్తోంది. ఇది డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో క్రిడిట్ అవ‌డం, మ‌ధ్య‌లో ఎలాంటి వారికి డ‌బ్బులు చెల్లించాల్సి రాక‌పోవ‌డంతో రైతులు ఈ ప‌థ‌కం ప‌ట్ల బాగా ఆక‌ర్శితుల‌య్యారు. టీఆర్ఎస్‌ను రెండో సారి అధికారంలోకి తీసుకురావ‌డానికి ఈ ప‌థ‌కం కీల‌క పాత్ర పోషింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios