రేవంత్ నోట చంద్రబాబు మాట.. ఇంకా తెలంగాణపై విద్వేషం , కాంగ్రెస్‌కు ఈసారి 3 సీట్లే : మంత్రి గంగుల
ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రేవంత్ చిత్రపటానికి కరీంనగర్‌లో ఉరేశారు. అధికారంలోకి వస్తే మూడు గంటలే ఇస్తామని చెప్పిన వారికి మూడు సీట్లే ఇవ్వాలని ఆయన చురకలంటించారు.
ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ భగ్గుమన్నారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రేవంత్ చిత్రపటానికి కరీంనగర్‌లో ఉరేశారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడించిన మాటలన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని, రైతులకి మూడు గంటలు చాలు అని ఆయన మాట్లాడారని గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మాటల ద్వారా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని బహిర్గతపరిచారని ఆయన ఎద్దేవా చేశారు. 1947 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మూడు గంటలే కరెంటు ఇచ్చారని గంగుల దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే మూడు గంటలే ఇస్తామని చెప్పిన వారికి మూడు సీట్లే ఇవ్వాలని ఆయన చురకలంటించారు. సీఎం కేసీఆర్ రైతు రాజుగా ఉండాలని 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఇక్కడి నుండి కరెంటు , బొగ్గు ఎత్తుకుపోతారని.. మూడు గంటల కరెంటు ఇస్తామని మేనిపెస్టో ప్రకటించుకున్నారని గంగుల కమలాకర్ దుయ్యబట్టారు.
Also Read: ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యలు .. రేవంత్ అలా అనలేదు, బీఆర్ఎస్ వక్రీకరణ, సీఎం అవ్వాలన్న ఆశల్లేవు: సీతక్క
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మీ రద్దు చేస్తారని.. కర్ణాటకలో తిండికి లేని పరిస్థితి ఉందని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ మాటలని, ఆ పార్టీని మూడు స్థానాలకే పరిమితం చేయాలని కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలని కాపాడే పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడి కాళేశ్వరం నీరు, బొగ్గు దోచుకుని పోతారని గంగుల కమలాకర్ హెచ్చరించారు.
ఓవైపు బీజేపీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే .. మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దు అని రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉందన్నారు.
ఇప్పుడు స్వరాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని మంత్రి గుర్తుచేశారు. తొలి నుంచి కాంగ్రెస్‌కు రైతులంటే చిన్నచూపేనని, మొన్న ధరణి వద్దన్నారు, ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పచ్చదనం చూసి రేవంత్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.