తెలంగాణలో తిరిగి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పంచాయితీరాజ్ శాాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధీమా వ్యక్తం చేసారు. 

వరంగల్ : తెలంగాణ కాంగ్రెస్, బిజెపి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లను మూర్ఖులు, దుర్మార్గులు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. వీరి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా... ఎన్ని మాయోపాయాలు చేసినా ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయాన్ని మాత్రం ఆపలేరన్నారు. సర్వేలన్ని బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెబుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. 

 పాలకుర్తి నియోజకవర్గంలో విజయం మళ్లీ తనదేనని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేసారు. గతంలో కంటే భారీగా ఈసారి 80వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని... సర్వేల్లో కూడా ఇదే తేలిందన్నారు. తనపై ఏ పార్టీ నుండి ఎవరు పోటీచేసినా ఓడిపోతారని... ఇదే జరగబోతోందని అన్నారు. పాలకుర్తి ప్రజలు ప్రతిపక్షాల అబద్దాలను నమ్మబోరని... తన హయాంలో జరిగిన అభివృద్ది, సంక్షేమమే గెలిపిస్తుందని ఎర్రబెల్లి అన్నారు. 

తొర్రూరులో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వంపై, అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోకుండా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వుందని మంత్రి అన్నారు. 

Read More సొంతగూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..? ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో నిరుద్యోగ భృతి ఇస్తారని ప్రకటించారని... మరి ఇప్పటికే అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడంలేదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో ఇస్తున్నట్లు అధిక పెన్షన్లు, పెట్టుబడి సాయం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌ని విధానాలను తెలంగాణ‌లో అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల కోసంమే హామీలు ఇస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. 

ఇక బిజెపి అధికారంలోకి రాగానే రూ.200 కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తామ‌ని చెప్పి రూ.1200 చేసిందని...అలాగే పెట్రోల్‌, డీజిల్ తో పాటు నిత్యావ‌స‌ర ధ‌ర‌లు విప‌రీతంగా పెంచిందన్నారు. అన్ని వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణమైన పార్టీ నేడు ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ధ‌ర్నాలు చేస్తుండ‌టం విడ్డూరంగా ఉంద‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేసారు.