ఇటీవలే పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి దయాకరరావు గ్రామాల పాలనపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల నూతనంగా ఎన్నికయిన సర్పంచ్ లకు వివిధ రకాల సలహాలు, సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నట్లు గ్రామాలు ముందుగా అభివృద్ది చెందాలని... ఆ దిశగా మనమంతా కలిసి పనిచేద్దామని నూతన సర్పంచ్ లకు మంత్రి పిలుపునిచ్చారు.

ముఖ్యంగా తమ సారథ్యంలోని గ్రామాలు పరిశుభ్రంగా, ప్రజల ఆరోగ్యం  వుండేలా సర్పంచ్ లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడమే లక్ష్యంగా  ప్రభుత్వం పనిచేస్తోందని...సర్పంచ్ లు అందుకుమ సహకరించాలన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వుండేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌దేనని అన్నారు.  ఆ విషయంలో అలసత్వం వహించిన సర్పంచ్ లను సస్పెండ్ చేయడానికి వెనుకాడనని ఎర్రబెల్లి హెచ్చరించారు. 

వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గంలో నూతన ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ... పుట్టిన గ్రామానికి సేవ చేసుకునే అవకాశం మీకందరికి వచ్చిందన్నారు. ఇలా సర్పంచ్ పదవి వచ్చిందని గర్వం తలకెక్కకూడదని...మాటతీరు, ప్రవర్తనలో మార్పు వస్తే గెలిపించిన ప్రజలే క్షమించరని నూతన సర్పంచ్‌లకు మంత్రి సూచించారు.